ఆ మంత్రులు డేంజర్ జోన్ లో లేరట
అధికారంలోకి రాగానే జగన్ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన జగన్ మంత్రి వర్గ విస్తరణ రెండు దఫాలుగా ఉంటుందని చెప్పారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గాన్ని ఎప్పుడు విస్తరిస్తారు? రెండున్నరేళ్ల తర్వాత విస్తరణ ఉంటుందని చెప్పిన జగన్ మూడేళ్లవుతున్నా ఎందుకు విస్తరించలేకపోతున్నారు? రాజకీయంగా ఇబ్బందులు వస్తాయనా? లేక ఎన్నికల సమయంలో సరైన టీం కోసం వెదుకుతున్నారా? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది. జగన్ ఎప్పుడు మంత్రి వర్గ విస్తరణ చేస్తారన్నది ఎవరికీ తెలియదు. ఆయన ఎప్పుడనుకుంటే అప్పుడే. ఆయనకు సన్నిహితంగా మెలిగే సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన నేతలు మాత్రం విస్తరణపై ఆరా తీస్తున్నారని తెలిసింది.
90 శాతం మారుస్తానని...
అధికారంలోకి రాగానే జగన్ తొలుత శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన జగన్ మంత్రి వర్గ విస్తరణ రెండు దఫాలుగా ఉంటుందని చెప్పారు. వచ్చే విస్తరణలో 90 శాతం మంది మంత్రులను మార్చి కొత్తవారికి అవకాశం కల్పిస్తానని చెప్పారు. విస్తరణ విషయం అప్పుడు ఎవరూ అడగలేదు. జగన్ తనంతట తానుగానే నేతల్లో ఆశలు నింపారు. అయితే రెండున్నరేళ్లు దాటిన తర్వాత కూడా విస్తరణ చేపట్టకపోవడం పై కారణాలు మాత్రం అనేక రకాలుగా ప్రచారం జరుగుతుంది.
గందరగోళ సమయంలో....
ప్రస్తుతం మూడు రాజధానుల బిల్లులను, సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేశారు. దీనిపై పూర్తి స్థాయి మార్పులతో కొత్త బిల్లులను సభముందకు తేనున్నారు. అది బహుశ వచ్చే సెప్టంబరు మొదటి వారంలో ఉంటుందంటున్నారు. దీనికి తోడు వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో బడ్జెట్ సమావేశాలు కూడా ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మంత్రివర్గ విస్తరణను జగన్ చేపడతారని కొందరు నేతలు చెబుతున్నారు.
అందరినీ మార్చరట....
అయితే వచ్చే ఎన్నికల నాటికి అవసరం ఉండటంతో మెజారిటీ మంత్రివర్గ సభ్యులు కొనసాగుతారనే చర్చ కూడా ఉంది. వంద శాతం మారుస్తారన్న ప్రచారం ఒట్టిదేనని, అక్కడక్కడా సామాజిక వర్గాల సమీకరణల ప్రకారం కొందరిని మాత్రం మార్చి 70 శాతం మందిని పాతవారినే కొనసాగిస్తారని కొందరు అభిప్రాయపడుతున్నారు. జగన్ పాలనలో పథకాలు, చేసిన అభివృద్ధిని వివరించాలంటే కొత్తగా చేరే మంత్రులకంటే పాతవారయితేనే బెటర్ అని జగన్ భావిస్తున్నారని తెలిసింది. ప్రతిపక్షాన్ని బలంగా విమర్శిస్తున్న ప్రస్తుత మంత్రులకు మాత్రం ఉద్వాసన ఉండకపోవచ్చంటున్నారు. ఎస్సీ, ఎస్సీ, మైనారిటీ, మహిళా మంత్రుల్లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.