ఈసారి లెక్కలు మారాయట...మంత్రివర్గ విస్తరణ అప్పుడే?
మూడేళ్లు పూర్తయిన తర్వాత జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. జూన్ నెలలో మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశాలున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్నారు. అసలు జగన్ మంత్రి వర్గ విస్తరణ చేస్తారా? లేదా? అన్న అనుమానం కూడా పార్టీ నేతలకు కలుగుతుంది. అయితే తాజాగా ఇందుకు సంబంధించి సంకేతాలను జగన్ ఇచ్చినట్లు తెలిసింది. మూడేళ్లు పూర్తయిన తర్వాత జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. అంటే జూన్ నెలలో మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశాలున్నాయి.
రెండున్నరేళ్లకే..
నిజానికి జగన్ రెండున్నరేళ్లకే మంత్రివర్గాన్ని విస్తరిస్తానని చెప్పారు. కానీ కరోనా కారణంగా దాదాపు ఏడాది పాటు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో జగన్ మంత్రివర్గాన్ని మూడేళ్లకు విస్తరించాలని భావించారు. జూన్ నెలతో జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతుంది. అప్పుడే మంత్రి వర్గాన్ని విస్తరించాలని జగన్ నిర్ణయించారట. మరో మూడున్నర నెలలు మాత్రమే సమయం ఉండటంతో దీనిపై కసరత్తు ప్రారంభమయినట్లు తెలిసింది.
కొందరికే మినహాయింపు...
దాదాపు 90 శాతం మంత్రివర్గంలో సభ్యులను జగన్ మార్చేవిధంగా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. సీనియర్ మంత్రులకు ఒకరిద్దరకు మాత్రమే మినహాయింపు ఉంటుందని, మిగిలిన వారు పార్టీ కోసం పనిచేయాలని కూడా సూచించనున్నారు. అయితే ఉగాది నాటికే కొత్త జిల్లాలు ఏర్పడుతుండటంతో ఆ ప్రాతిపదికనే మంత్రివర్గ విస్తరణ చేయాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. ఇటీవలే కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఆ ప్రాతిపదికనే....
ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. అయితే కొత్త జిల్లాల ప్రాతిపదికన మంత్రివర్గంలోకి సభ్యులను తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. సామాజికవర్గాల సమీకరణలతో పాటు కొత్త జిల్లాలు కూడా ఈసారి మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. జూన్ 8వ తేదీతో మంత్రివర్గం ఏర్పాటై మూడేళ్లు అవుతుంది. అప్పుడే మంత్రివర్గ విస్తరణను జగన్ చేపట్టనున్నారని తెలిసింది.