గంటా ఎంటర్ అయినట్లేనా?
వన్ కల్యాణ్ కామెంట్స్ వెనక గంటా శ్రీనివాసరావు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీకి వ్యతిరేకంగా తాను అన్ని పార్టీలను ఏకం చేస్తానని చెప్పారు. వ్యతిరేక ఓట్లు చీలకుండా బాధ్యతను తానే తీసుకుంటామని చెప్పారు. అయితే ఇది ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. పవన్ కల్యాణ్ కామెంట్స్ వెనక గంటా శ్రీనివాసరావు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. పవన్ ను ముఖ్యమంత్రిని చేయాలని, కాపులకు రాజ్యాధికారం రావాలన్న దిశగా గంటా ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
వరస సమావేశాలతో....
కాపు సామాజికవర్గం నేతలు, మేధావులతో గంటా శ్రీనివాసరావు వరస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నా ముఖ్యమంత్రి పదవి దక్కడం లేదన్నది అందరి అభిప్రాయం. తమ సామాజికవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కాపులు ప్రత్యేకత ఈ ఎన్నికల్లో చూపాలన్నది సమావేశంలో అందరు ఏకాభిప్రాయంతో అంగీకరించారు.
మంత్రి పదవులతోనే...
అన్ని పార్టీల్లో కాపు నేతలున్నా, వారికి మంత్రి పదవులతో సరిపెడుతున్నారని, ఈ వైఖరిని మార్చాలంటే మనమే ఆల్టర్నేటివ్ గా మారాలని కాపు సామాజికవర్గంలో బలమైన నేతను ముందుంచాలని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. వారికి పవన్ కల్యాణ్ బలమైనే నేతగా కన్పించారు. ఇప్పటికే పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ ను ఈసారి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలన్నది కాపు సామాజికవర్గం పెద్దల ఆలోచనగా చెబుతున్నారు.
కాపులకు సీఎం ఛైర్.....
వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు కావాలంటే కాపులకే ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్న పార్టీకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగానే పవన్ కల్యాణ్ కూటమి ఏర్పాటు ప్రకటన చేశారంటున్నారు. గంటా శ్రీనివాసరావు కూడా జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఆయన ప్రస్తుతం టీడీపీలో ఉన్నా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. స్పీకర్ ఆమోదం పొందక పోయినా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లైవ్ లోనే ఉంది. ఆయన అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. కాపు సామాజికవర్గం నుంచి వచ్చిన సూచనలు, సలహా మేరకు పవన్ కల్యాణ్ ఆవిర్భావ సభలో ఈ ప్రకటన చేశారన్న ప్రచారం అయితే బాగానే వినపడుతుంది.