అవసరం బాబుదే.. గేమ్ ఛేంజర్ పవన్

జనసేన పదో ఆవిర్భావ వేడుక జరుగుతుంది. ఈ సందర్బంగా పవన్ పంచ్ లు ఎలా ఉంటాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది

Update: 2023-03-14 02:46 GMT

ఈరోజు పవన్ ప్రసంగం ఎలా ఉంటుందో? మార్చి 14న మచిలీపట్నంలో జనసేన పదో ఆవిర్భావ వేడుక జరుగుతుంది. ఈ సందర్బంగా పవన్ పంచ్ లు ఎలా ఉంటాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో పెద్దయెత్తున చర్చే జరుగుతుంది. మచిలీపట్నం బహిరంగ సభకు ముందే పవన్ కొన్ని సంకేతాలను పంపారు. తెలుగుదేశం పార్టీతో పొత్తును కాదనలేదు కాని, తాను ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టనని చెప్పారు. అంటే ముఖ్యమంత్రి పదవితో పాటు గౌరవప్రదమైన సంఖ్యలోనే స్థానాలను పవన్ కల్యాణ్ పొత్తులో భాగంగా కోరుకునే అవకాశముందన్నది సుప్పష్టం.


రేపటి సభలో...

పవన్ పెట్టే డిమాండ్లకు చంద్రబాబు దిగి వస్తారా? లేదా తనతో కలసి వచ్చే పార్టీలతో ఎన్నికలకు వెళతారా? అన్నది ప్రస్తుతం ఆయన ముందున్న ప్రధాన అంశం. బంతి చంద్రబాబు కోర్టులోనే ఉంది. పవన్ కు వచ్చే ఎన్నికల్లో గెలిచినా, ఓడినా పెద్దగా ఫరక్ పడదు. ముఖ్యమంత్రి పదవి కాకుండా మరో పదవితో సంతృప్తి పడితే కాపు సామాజికవర్గం నుంచి తనకు ఎన్నటికీ మద్దతు లభించిందన్న ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే కొంతకాలమైనా ఏపీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే పొత్తులకు ఆయన సిద్ధమవుతారు. అంతేకాదు నలభై నుంచి యాభై స్థానాలను పొత్తులో భాగంగా కోరుకునే ఆలోచనలో ఉన్నారు.
రెండింటికీ అంగీకరిస్తేనే...
ఈ రెండింటిలో దేనికి చంద్రబాబు అంగీకరించకపోయినా పవన్ పొత్తుకు సిద్ధపడరు. ఆ క్లారిటీ రేపటి సభలో ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. అదే జరిగితే పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలంటే చంద్రబాబే దిగిరాక తప్పదు. ఎందుకంటే ఒంటరిగా పోటీ చేసే సాహసాన్ని, ధైర్యాన్ని చంద్రబాబు మరోసారి చేయరు. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని సర్వేలు బయటకు వచ్చినా బలంగా ఉన్న జగన్ ను ఒంటరిగా ఎదుర్కొనడం అంత సులువు కాదన్న సంగతి ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీకి తెలియంది కాదు. పవన్ తో పొత్తు కాదనుకుని ఒంటరిగా వెళితే జగన్ మరోసారి అధికారంలోకి వస్తే ఇక పార్టీ మనుగడ కష్టమేనన్న విషయాన్ని కూడా ఆయన మరిచిపోరు. చంద్రబాబుకు ఎలాగైనా సమస్యే.

బాబు కోర్టులోనే...
పవన్ కల్యాణ్ షరతులకు ఒప్పుకుంటే పార్టీ నేతలు అనేక మంది ఇబ్బంది పడతారు. అలా కాదని మొండిగా ముందుకు వెళ్లలేని పరిస్థిితి. తన వారసుడు లోకేష్ రాజకీయ భవిష్యత్ కూడా తానే చేజేతులా నాశనం చేసినట్లవుతుంది. అందుకే పొత్తులు పవన్ కల్యాణ్ అవసరం కన్నా చంద్రబాబుకే ఎక్కువ అవసరం. ఈ విషయాన్ని గ్రహించి పవన్ బిగిస్తున్నట్లుంది. తొలి రెండున్నరేళ్లు జనసేనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నది పొత్తుల సందర్భంగా ప్రధాన డిమాండ్ గా మారనుంది. మరి చంద్రబాబు అందుకు ఒప్పుకుంటేనే పొత్తుల చర్చలు ముందుకు సాగుతాయి. లేదంటే ఇక ఎవరి దారి వారిదే. అయితే అంత సులువుగా చంద్రబాబు పొత్తులు కాదని ఒంటరిగా పోటీ చేయలేరు. ఓటు బ్యాంకు లేని కమ్యునిస్టులను నమ్ముకుని బరిలోకి దిగలేరు. ఆయనకు జనసేన అవసరం. కాపుల ఓట్లు కావాలి. అంతే .. అదే పొత్తుల సందర్భంగా ఏదైనా జరిగే ఛాన్స్ లేకపోలేదు. కానీ అడ్వాంటేజీ మాత్రం చంద్రబాబు కన్నా ఈసారి పవన్ కే ఎక్కువగా కనపడుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.


Tags:    

Similar News