వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కాకాణి..తొలి సంతకం దానిపైనే..
మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. గన్నవరంలో రాష్ట్ర విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని..
వెలగపూడి : మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్ లో వ్యవసాయశాఖ మంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 3.75 లక్షల ఎకరాలకు మైక్రో ఇరిగేషన్ అవకాశం కల్పించే ఫైల్ పై తొలిసంతకం చేశారు. దీని కోసం రూ.1395 కోట్లు ఖర్చు చేయనున్నారు. రెండో సంతకం 3,500 ట్రాక్టర్లను వైఎస్సార్ యంత్ర పథకం కింద ఇచ్చే ఫైల్ పై చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. గన్నవరంలో రాష్ట్ర విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే.. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల అవసరాలను తీర్చేలా పీఏసీ ఖాతాలకు అనుసంధానం చేయాలని నిర్ణయించామన్నారు. రైతుల నగదు లావాదేవీలు కూడా ఆర్బీకేలలో జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానని ఆయన అన్నారు. మంత్రిగా తనకు అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ కి ధన్యవాదాలు తెలిపారు.