ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. కన్నడ కాంగ్రెస్ కొత్త క్యాంపెయిన్
కర్ణాటక ఎన్నికలు ఈ ఏడాది జరగనున్నాయి. ఇప్పటికే కన్నడ రాజకీయాలు హీట్ ఎక్కాయి, కాంగ్రెస్ ఉచిత వాగ్దానాలు చేస్తుంది
కర్ణాటక ఎన్నికలు ఈ ఏడాది జరగనున్నాయి. ఇప్పటికే కన్నడ రాజకీయాలు హీట్ ఎక్కాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాయి. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు తరచూ కన్నడ రాష్ట్రానికి వస్తూ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో జయప్రదంగా ముగిసింది. ఇక్కడ అగ్రనేతలు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యలు కలసి పనిచేస్తున్నారు. సమన్వయంతో కార్యక్రమాలను చేపడుతున్నారు. రాహుల్ యాత్రకు కంటిన్యూగా బస్సు యాత్రను కూడా చేపట్టారు.
అభ్యర్థుల ఎంపిక...
నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను కూడా ఎంపిక చేసే పనిలో ఉన్నారు. నమ్మకంగా ఉండే నేతలనే అభ్యర్థులుగా ఎంపిక చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. అందుకోసమే పార్టీలో సీనియారిటీని కూడా సీట్ల కేటాయింపులో ప్రాధాన్యతగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. వారైతేనే నమ్మకంగా ఉంటారని కాంగ్రెస్ హైకమాండ్ కూడా భావిస్తుంది. గతంలో మాదిరి పార్టీని ఫిరాయించి బీజేపీకి అధికారం అప్పగించడం వంటివి మరోసారి జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీలో హిస్టరీని బట్టి క్యాండిడేట్ ను ఎంపిక చేయాలన్న నిర్ణయానికి వచ్చారని తెలిసింది.
సొంతంగా ఏర్పాటు చేయాలంటే...
ఇక వాగ్దానాల విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ తగ్గడం లేదు. బీజేపీని తట్టుకుని మెజారిటీ స్థానాల్లో గెలవాలంటే ఉచిత హామీలే బెటరని భావిస్తున్నట్లుంది. 225 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో మ్యాజిక్ ఫిగర్ 115 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ వెలువడుతున్న సర్వేల్లో కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండటంతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తుంది. గత ఎన్నికల్లో 80 స్థానాలు వచ్చినా జేడీఎస్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది. అలా కాకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రజల వద్దకు వెళుతుంది. అందుకే ఉచిత హామీలను విస్తృతంగా ఇస్తుంది.
మహిళకు 24 వేలు...
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను ఇస్తామని ప్రకటించింది. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకూ ఎటువంటి బిల్లులను వేయబోమని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అదే మాదిరిగా గృహలక్ష్మి పథకాన్ని కూడా తాజాగా ప్రకటించింది. ఈ పథకం కింద మహిళలకు ప్రతి నెల రెండు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఏడాదికి ప్రతి మహిళకు 24 వేల రూపాయలు ఉచితంగా అందచేస్తామని చెప్పడంతో మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. పేద మహిళలకు ఆసరాగా నిలిచేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టనట్లు చెబుతున్నారు. ఏపీలో ఇటువంటి పథకం అమలవుతుండటంతో దానిలో కొన్ని మార్పులు చేసి గృహలక్ష్మి అంటూ పథకాన్ని ప్రవేశపెట్టింది. మరి కాంగ్రెస్ ఉచిత హామీల ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.