టీఆర్ఎస్ ఓడిపోతే తనకు నష్టమేమీ లేదని, గెలిస్తే మరింత పట్టుదలగా పనిచేస్తామని... ఓడితే వెళ్లి వ్యవసాయం చేసుకుంటానని... కానీ, చంద్రబాబు చేతికి అధికారం పోతే తెలంగాణ రాష్ట్రం, ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి 35 ఉత్తరాలు రాసిన చంద్రబాబు పెత్తనం వస్తే తెలంగాణ నష్టపోతుందన్నారు. గురువారం ఖానాపూర్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ... తనతో కొట్లాడితే కాంగ్రెస్ కొట్లాడాలి కానీ... చంద్రబాబును బుజంపై ఎత్తుకుని ఎందుకు తీసుకువస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబును ఇప్పటికే తాను ఒక్కసారి తరిమకొట్టానని, ఈసారి ప్రజలు బుద్దిచెప్పాలని కోరారు. తెలంగాణలో చంద్రబాబు పెత్తనమే వస్తే ధరఖాస్తులు పట్టుకుని అమరావతికి పోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
మొదటి నుంచీ ద్రోహం చేసింది కాంగ్రెస్సే
తెలంగాణకు మొదటి నుంచీ కాంగ్రెస్ అన్యాయం చేసిందని, ఉన్న తెలంగాణను ముంచి 1956లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో కలిపిందని, 1969లో తెలంగాణ అడిగినందుకు 400 మందిని కాంగ్రెస్ కాల్చి చంపిందన్నారు. 14 ఏళ్లు తెలంగాణ ఇవ్వవద్దనే సోనియా గాంధీ ప్రయత్నించిందని, తన పోరాటం, గ్రామగ్రామన తెలంగాణ ప్రజల పోరాటం చూసి కొంప మునుగుతుందని తెలంగాణ ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మళ్లీ టీఆర్ఎస్ కే ఓటేసి గెలిపించాలని కోరారు.