ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినా.. ఓడిపోయినా.. తనకు నష్టమేమీ లేదని... గెలిస్తే మరింత కష్టపడి పనిచేస్తామని... ఓడితే రెస్ట్ తీసుకుంటానని లేదా వ్యవసాయం తీసుకుంటానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఫేస్ బుక్, వాట్సాప్ లో నిమిషాల్లోనే వైరలయ్యాయి. ఇంతవరకూ కచ్చితంగా 100 సీట్లు గెలుస్తామని ధీమాగా చెబుతున్న కేసీఆర్ నోట ‘ఓటమి’ అనే మాట రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఆయన ప్రసంగంలో భాగంగా టీఆర్ఎస్ ఓడిపోతే జరిగే పరిణామాలను ప్రజలకు వివరించారు. అయితే, దొరికిందే అదునుగా ప్రత్యర్థి పార్టీలు కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్లు వేస్తున్నాయి. ఓడితే బాధ్యత గల ప్రతిపక్షంగా ధర్మం నెరవేర్చాలి కానీ రెస్ట్ తీసుకుంటా అనడం సరికాదని.. కేసీఆర్ మాటలపై ప్రజలు ఆలోచన చేయాలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక గెలిచినా... ఓడినా కేసీఆర్ ఫాంహౌజ్ కే పరిమితం అవుతారు కదా అని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఎద్దేవా చేశారు. మొత్తానికి ఎన్నికల వేళ ‘ఓటమి’ మాట టీఆర్ఎస్ కి ఇబ్బందికరంగా మారుతోంది.