మురుగు కాల్వలో కోటంరెడ్డి నిరసన
మురుగుకాల్వపై వంతెన నిర్మించలేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసనకు దిగారు. ఏకంగా మురుగు కాల్వలోకి దిగారు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వస్తే ఆగరు. అది అధికారులపైన అయినా కాని, సొంత పార్టీ నేతలయినా కాని. వెంటనే యాక్షన్ లోకి దిగుతారు. నెల్లూరు ఉమ్మారెడ్డి గుంటలో గత కొంతకాలం నుంచి మురుగు కాల్వ సమస్య ఉంది. మురుగునీటి కాల్వపై వంతెన నిర్మాణం చేపట్టాలని అనేక రోజుల నుంచి కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. కార్పొరేషన్ అధికారులను అడిగితే తమది కాదని చెబుతారు. వంతెన రైల్వే అధికారులు నిర్మించాలని చెబుతారు.
కొన్ని ఏళ్లుగా...
రైల్వే అధికారులు మాత్రం కొన్ని సంవత్సరాలుగా ఈ వంతెన నిర్మాణాన్ని పట్టించుకోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుుడు కూడా దీనిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన తెలిపారు. అయినా ఫలితం లేదు. ఈరోజు తాజాగా మురుగుకాల్వపై వంతెన నిర్మించలేదని నిరసనకు దిగారు. ఏకంగా మురుగు కాల్వలోకి దిగారు. తనను ఎన్నుకున్న ప్రజలు తన కాలర్ పట్టుకుని నిలదీస్తున్నారని కోటంరెడ్డి చెబుతున్నారు. అధికారులను అడిగితే పట్టించుకోరని, అందుకే మురుగునీటి కాల్వలో దిగి నిరసన తెలియజేశానని కోటంరెడ్డి శ్రీధర్ తెలిపారు.