ఫోన్ ట్యాపింగ్ చేశారు.. ఇదిగో ఆధారాలు
ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. దర్గాకు ముఖ్యమంత్రి జగన్ నిధులు మంజూరు చేసినా అధికారులు విడుదల చేయలేదన్నారు. అవమానాలు జరగాల్సిన చోట తాను ఉండలేనని అన్నారు. తనకు నటన చేతకాదని, మోసం చేయడం చేతరాదని ఆయన అన్నారు. ప్రజలు ఏ విధంగా తీర్పు నిచ్చినా తాను గౌరవిస్తానని తెలిపారు. ఇక పార్టీలో ఉండలేని అనుకున్నప్పుడు ఇక ఉండకూడదని అన్నారు. తాను వైసీపీపై వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని అన్నారు.
మనసు కలత చెందే...
జగన్ ను, వైసీపీని ఎప్పుడూ తాను విమర్శించలేదన్నారు. ఫోన్ ట్యాప్ పైన తనవద్ద స్పష్టమైన ఆధారాలున్నాయన్నారు. తన వివరణ తీసుకోకుండా ఇన్‌ఛార్జిని నియమిస్తానడం ఎంత వరకూ సబబని అని అన్నారు. తన మనసు వైసీపీలో ఉండొద్దని చెబుతుందన్నారు. తన మనసు కలత చెందే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలతో బయటపెడతానని కోటంరెడ్డి తెలిపారు. తన స్నేహితుడితో జరిపిన సంభాషణలను ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు ఆడియో టేపును తనకు పంపారన్నారు. మరి ఇది ఫోన్ ట్యాపింగ్ కాదా? అని కోటంరెడ్డి ప్రశ్నించారు.
ఎందుకు రికార్డు చేశారు?
తన ఫోన్ కాల్ ను ఎందుకు రికార్డు చేశారు? సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేశారంటే ఇక ఎవరిమీదనైనా చేస్తారని కోటంరెడ్డి అన్నారు. తాను వైఎస్ కుటుంబంతోనే దశాబ్దాలుగా నడుస్తున్నానని అన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి తన ఫోన్ ట్యాప్ చేయలేదంటున్నారు. ఇదిగో సాక్షాధారాలంటూ ఫోన్ ఆడియోను చూపారు. తన ఫోన్ ను ట్యాప్ చేశారంటే తనపై నమ్మకం లేకనే కదా? అని ఆయన ప్రశ్నించారు. తాను గాలి మాటలు మాట్లాడనని, ఆధారాలు లేకుండా మాట్లాడనని అన్నారు. ఎన్నో అవమానాలను భరించా కాని, ఇక ఉండలేకపోతున్నానని అన్నారు. జగన్, సజ్జల చెప్పకుండా ఫోన్ ట్యాపింగ్ చేయరన్నారు.
కేంద్ర హోంశాఖకు...
కేంద్ర హోంశాఖకు తాను దీనిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. నమ్మకం లేకపోతే నేరుగా తనను పిలిచి మాట్లాడవచ్చని, ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. తాను తెలుగుదేశం పార్టీలోకి వెళతానని ముందుగానే ట్యాపింగ్ చేశారా? అని నిలదీశారు. దాపరికం లేదని, ముసుగులో గుద్దులాట ఏవీ లేదని, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలిసిన తర్వాత నిర్ణయం తన ఇష్టమొచ్చిన నిర్ణయం తీసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. వైసీపీలో తాను ఇక ఉండలేనని, భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని ఆయన తెలిపారు.