పోలీసు శాఖ తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్న జగన్ పై జరిగిన దాడి ఘటనలో పోలీసులు సరైన సమయంలో స్పందించక పోవడం వల్లనే ప్రతిపక్షాలు మాట్లాడటానికి అవకాశమిచ్చినట్లయిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అన్ని జిల్లాల పోలీసు శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. ఆలస్యంగానైనా తాము స్పందంచబట్టే పరిస్థితిని కంట్రోలు చేయగలిగామన్నారు. రాష్ట్రంలో కానిస్టేబుల్ తప్పు చేసినా అది తనపైకే వస్తుందని, అన్నీ తెలిసినట్లు నటించకూడదని కొందరు అధికారులకు సీఎం చురకలంటించారు.
పెరగనున్న రాజకీయ నేరాలు.....
రాష్ట్రంలో రానున్న కాలంలో మరిన్ని రాజకీయ నేరాలు జరిగే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే డీజీపీ ఆర్పీ ఠాకూర్ పై కూడా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి సమర్పించిన నివేదిక సక్రమంగా లేదని సీఎం అభిప్రాయపడ్డారు. తూర్పు గోదావరి జిల్లాలో నేరాలు ఎందుకు పెరుగుతున్నాయన్న దానిపై సరైన విశ్లేషణ చేయలేదని చంద్రబాబు అన్నారు. రాజకీయ నేరాలను అరికట్టడంలో పోలీసులు మరింత చొరవ చూపించాలని చంద్రబాబు కోరారు.