పవన్ ను డీల్ చేయడం ఈజీ కాదు బాబూ?

ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే చంద్రబాబుతో వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందన్న సంకేతాలను పవన్ కల్యాణ్ బలంగా పరోక్షంగా ఇచ్చారు.

Update: 2023-03-12 12:54 GMT

చంద్రబాబు వ్యూహాలు అవుడేటెడ్. ఆయన పాత కాలం నాటి స్ట్రాటజీలు ఇప్పుడు పనిచేసేటట్లు లేవు. పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వస్తున్న చంద్రబాబు ఈసారి కూడా జనసేనతో కలసి ఎన్నికలకు వెళ్లి మరోసారి అధికారం పొందాలని భావిస్తున్నారు. అందుకు ఎన్నికలకు ముందు పవన్ వద్దకు వెళ్లి మరీ ఆయనను పరామర్శించి వచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వకూడదంటూ జనసేనను దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈసారి చంద్రబాబు ఎత్తుగడలు అంత సులువుగా వర్క్ అవుట్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇంతకు ముందులా మీడియా సర్వేలు, ప్రధాన పత్రికల మద్దతు ఇవేమీ నేతలకు పట్టడం లేదు. తాము అనుకున్న గోల్ కు చేరాలనుకుంటున్నారు. పవన్ కూడా అంతే.

రాటుదేలిన కల్యాణ్...
పవన్ కల్యాణ్ కూడా పార్టీ పెట్టి పదేళ్లవుతుంది. ఆయన కూడా రాజకీయంగా రాటుదేలినట్లుంది. ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే చంద్రబాబుతో వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందన్న సంకేతాలను బలంగా పరోక్షంగా ఇచ్చారు. అంతే కాదు జనసేన కోరుకున్న స్థానాలను పొత్తులో భాగంగానే పొందితేనే టీడీపీతో జత కడతారు. లేకుంటే లేదు. పొత్తు లేకపోయినా పవన్ కల్యాణ్ కు పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు. అది ఆయనకూ తెలుసు. 25 ఏళ్ల పాటు తాను రాజకీయం చేస్తానని ఆయన చెప్పుకుని మరీ పార్టీని పెట్టారు. గత రెండు ఎన్నికల పరిస్థితి వేరు. 2024 ఎన్నికల పరిస్థితి వేరు. చంద్రబాబుకు పవన్ ను డీల్ చేయడం అంత సులువు కాదనిపిస్తుంది.

ఇరవై సీట్లకే...
దీనికి తాజాగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎత్తుగడలు తనకు తెలియనవి కావని పవన్ తెితెలిపారు. తనతో మంచిగా ఉంటూనే కేవలం ఇరవై సీట్లకు మాత్రమే పరిమితం చేయాలన్న సంకేతాలను ఆ పార్టీ ఇస్తుందని కూడా తెలుసునని అన్నారు. జనసేన స్వతంత్రంగా ఉంటుందే తప్ప ఒకరి వద్ద ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టబోనని ఆయన కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో జరిగిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో మరోసారి హీట్ ను రేపాయి. తనపై వెయ్యి కోట్లు ప్యాకేజీ అంటూ ప్రచారం మొదలుపెట్టారన్నారు. అయితే జనసేన పెట్టి పదేళ్లవుతున్నా ఇంకా అనుకూల పవనాలు రాలేదన్నారు. తాను వేరే పార్టీ అజెండాను మోయలేమన్నారు. పదివేల కోట్లున్నా సంకల్పం లేకుంటే పార్టీని నడపలేమన్నారు. లోపాయికారి ఒప్పందాలకు లొంగిపోను అంటూ పవన్ కల్యాణ్ కాపు సంక్షేమ సేన కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చారు.
జోగయ్య వ్యాఖ్యలు కూడా...
మరో వైపు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య కూడా తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరిగారు. జగన్ పోవాలి.. పవన్ రావాలి అన్నదే కాపు సంక్షేమ సేన లక్ష్మమన్న హరిరామ జోగయ్య జనసేనను బలహీన పర్చాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. కన్నా లక్ష్మీనారాయణ, మహాసేన రాజేష్ లను జనసేనలో చేరకుండా చంద్రబాబు అడ్డుకున్నారని జోగయ్య ఆరోపించారు. కేవలం ఇరవై సీట్లకే జనసేనను పరిమితం చేసి తాను తిరిగి ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని జోగయ్య అన్నారు. దీనికి పవన్ కల్యాణ్ కూడా తాను ఎవరి లోపాయికారీ ఒప్పందాలకు లొంగనని చెప్పడంతో టీడీపీ, జనసేన పొత్తు అంత సులువుగా అయితే కుదిరేటట్లు లేవు. ముఖ్యమంత్రి పదవిని కనీసం రెండున్నరేళ్లయినా పవన్ కల్యాణ‌ కు ఇస్తేనే పొత్తు కుదురుతుందని, అందుకు జనసేన కూడా సిద్ధమవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


Tags:    

Similar News