షరతులు... పొత్తులు... వర్క్ అవుట్ అవుతాయా?
తెలుగుదేశం పార్టీ అశక్తతను పవన్ కల్యాణ్ ఈసారి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది
తెలుగుదేశం పార్టీ అశక్తతను పవన్ కల్యాణ్ ఈసారి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యమూ, శక్తి లేదు. ఒంటరిగా పోటీ చేసినా మరోసారి ఓటమి ఎదురయితే ఈసారి పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. అందుకే టీడీపీ వచ్చే ఎన్నికల్లో పొత్తులను తప్పకుండా కోరుకుంటుంది. ప్రధానంగా జనసేనతో పొత్తు పెట్టుకుని వెళ్లాలన్న టీడీపీ ఆలోచన ఈసారి తనకు అనుకూలంగా మార్చుకోవడానికే జనసేనాని సిద్ధమయినట్లే కనపడుతుంది.
టీడీపీ వీక్ నెస్ ని....
తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాల్లో బలంగా ఉంది. అయితే అది అధికార వైసీపీని ఓడించేంత బలం ఉందా? లేదా? అన్నది సందేహమే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు దెబ్బకొడతాయా? అన్న ఆందోళన టీడీపీ నేతల్లో ఉంది. అందుకే అగ్రనాయకత్వం నుంచి కిందిస్థాయి వరకూ జనసేనతో పొత్తు కోరుకుంటున్నారు. జనసేన కలసి వస్తే ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు జిల్లా వరకూ తమకు తిరుగు లేదని భావిస్తున్నారు. రాయలసీమలో జనసేన ప్రభావం పెద్దగా లేకున్నా కోస్తాంధ్రలో అధిక స్థానాలను గెలుచుకుని అధికారంలోకి రావచ్చన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే అందరూ కలసి రావాలని తాము నాయకత్వం వహిస్తామని చంద్రబాబు గతంలో చెప్పారు.
పవన్ కామెంట్స్...
కాని నిన్న జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీకి ఇబ్బందికరంగా మారాయి. రెండు దఫాలు తాము తగ్గామని, ఈసారి మిగిలిన వారు తగ్గాలని ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశమయ్యాయి. మొన్నటి వరకూ ఈసారి జనసేన ఎక్కువ శాసనసభ స్థానాలను కోరుకుంటుందని టీడీపీ నేతలు భావించారు. కానీ పవన్ కల్యాణ్ మాటలను చూస్తుంటే ఏకంగా ముఖ్యమంత్రి పదవిని కోరుకుంటున్నట్లుందన్నట్లుందని వారు అభిప్రాయపడుతున్నారు. 2024 ఎన్నికల్లో తాము తగ్గమని స్పష్టం చేశారు. అనుభవం ఉన్న చంద్రబాబుకు కాకుండా పవన్ కల్యాణ్ కు ఎలా సీఎం పదవి ఇస్తారన్న చర్చ ఇప్పుడే మొదలయింది.
తాము బలంగా......
మరోవైపు మహానాడు సూపర్ సక్సెస్ అయిందని భావిస్తున్న టీడీపీ నేతలు తాము కూడా తగ్గేదేలే అన్నట్లు క్షేత్రస్థాయిలో వ్యవహరిస్తున్నారు. ఈసారి ప్రజలు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వాలనుకుంటున్నారని, జనసేన పార్ట్‌నర్ గా వస్తే మంచిదే గాని షరతులకు లొంగే ప్రసక్తి లేదని వారు అంటున్నారు. షరతులు పెట్టేంత బలం జనసేనకు ఉందా? లేదా? అన్నది ఒకసారి పరిశీలన చేసుకోవాలని కూడా టీడీపీ నేతలు సూచిస్తున్నారు. బీజేపీ కూడా టీడీపీతో కలవాలంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ను ప్రకటించాలన్న షరతు విధించే అవకాశముంది. మొత్తం మీద ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా... పవన్ కామెంట్స్ తో పొత్తుల విషయంలో మాత్రం కొంత సందిగ్దత ఏర్పడినట్లే కనపడుతుంది.