జేబుకు చిల్లు.. భారత్ లో వచ్చే వారమే పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

ఇప్పటి వరకూ ఆగిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలు మార్చి 10 తర్వాత భారీగా పెరగనున్నట్లు సమాచారం. వచ్చేవారమే ఆయిల్ మార్కెటింగ్..

Update: 2022-03-02 09:37 GMT

న్యూ ఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లకు చేరింది. భారత్ కొనుగోలు చేసే ముడిచమురు ధర మార్చి 1న 102 డాలర్లకు చేరింది. 2014 ఆగస్ట్ తర్వాత ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం. మనదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయని మొదట్నుంచి సంకేతాలొస్తున్నాయి. కానీ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా కేంద్రం అనధికార సూచనల మేరకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు అయిన బీపీసీఎల్, ఐవోసీ, హెచ్ పీసీఎల్ నాటి రేటునే స్థిరంగా కొనసాగిస్తున్నాయి. అందుకే గతేడాది నవంబర్ నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల రోజువారీ పెంపు ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.

మార్చి7న చివరిదశ పోలింగ్ ముగియనుంచి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. దాంతో ఇప్పటి వరకూ ఆగిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలు మార్చి 10 తర్వాత భారీగా పెరగనున్నట్లు సమాచారం. వచ్చేవారమే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్ల సవరణను మొదలు పెట్టవచ్చని జేపీ మోర్గాన్ సంస్థ అంచనా వేసింది. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతానికి లీటర్ పెట్రోల్, డీజిల్ విక్రయంపై రూ.5.7 వరకు నష్టపోతున్నాయి. దీనికి రూ.2.5 మార్జిన్ అదనం. దీంతో ఒక లీటర్ పై రూ.9-10 వరకు ధరను పెంచక తప్పని పరిస్థితి ఉందని జేపీ మోర్గాన్ విశ్లేషించింది.



Tags:    

Similar News