గుండెల్ని పిండేసే ఫొటోలు.. తిండి, నీళ్లు దొరక్క జిరాఫీలు మృతి
తిండి,నీరు లేక జిరాఫీలు చనిపోయిన చిత్రాలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఈ హృదయ విదారక ఘటన ఆఫ్రికా దేశమైన కెన్యాలో జరిగింది.
మనుషులకైనా.. మూగజీవాలకైనా ఆకలి, దాహం ఒక్కటే. మనకు ఆకలి వేస్తే వండుకుని తింటాం. దాహం వేస్తే మంచినీళ్లు తాగుతాం. అవి దొరక్కపోతే ఒక వాటర్ బాటిల్ కొనుక్కుని దాహాన్ని తీర్చుకుంటాం. కానీ.. వాన చినుకు జాడలేక.. తాగేందుకు మంచినీళ్లు కూడా దొరక్క ప్రాణాలు కోల్పోవడం కంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా ? ఇదే జరిగింది కెన్యా దేశంలో. గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లు లేక అల్లాడి.. ఆకలితో నకనకలాడి చనిపోయాయి ఆరు జిరాఫీలు. తిండి, నీరు లేక జిరాఫీలు చనిపోయిన చిత్రాలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఈ హృదయ విదారక ఘటన ఆఫ్రికా దేశమైన కెన్యాలో వాజిర్ లోని సాబూలీ వైల్డ్ లైఫ్ కన్జర్వెన్సీలో చోటుచేసుకుంది.
తిండి, నీరు లేక....
ఆరు జిరాఫీలు తిండి లేక..నీరు లేక ఒకే చోట పడి చనిపోయిన హృదయ విదారక చిత్రాలు వైరల్ గా మారాయి. వాన జాడ లేక..చుక్క నీరు కురవకపోవటంతో నీళ్లు లేక..తిండి దొరక్క మూగజీవాల మృత్యు ఘోష పెడుతున్నాయి. కెన్యా ఉత్తర ప్రాంతంలో గత సెప్టెంబర్ నుంచి సాధారణ వర్షపాతం కంటే 30 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో ఆ ప్రాంతంలో కరువు తాండవించింది. దాహంతో గొంతు పిడచకట్టుకుపోతుంటే జిరాఫీలు నీటి కోసం మైళ్లకొద్దీ దూరాలు నడిచాయి. అయినా ఎక్కడా నీటి చుక్క కనిపించలేదు. నీటి కోసం వెతుక్కుంటూ వెళ్లిన జిరాఫీలు కన్జర్వెన్సీలోని ఓ రిజర్వాయర్ లోకి వెళ్లాయి. అందులోని ఓ బురుదమడుగులో కూరుకుపోయి బయటకు రాలేకపోయాయి. దీంతో తిండి..నీళ్లు లేక అలమటించి అవి ప్రాణాలు వదిలాయని అక్కడి సిబ్బంది తెలిపారు.
వన్యప్రాణులు....
పెంపుడు జంతువులకు వాటి యజమానులు ఎలాగోలాగా కనీసం నీరు అందించవచ్చు. కానీ వన్యప్రాణులకు ఈ కరవు మరణఘోషగా మారుతోందని మరిన్ని వన్యప్రాణులు ప్రమాదపు అంచుల్లో ఉన్నాయని బౌర్ ఆల్జీ జిరాఫీ శాంక్చువరీ ఉద్యోగి ఇబ్రహీం అలీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కరవుతో గరిస్సా కౌంటీలోని 4 వేల జిరాఫీలకు ప్రమాదం పొంచి ఉందని..వాటి ప్రాణాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని ఓ నివేదిక చెబుతోంది. ఈ కరవును జాతీయ విపత్తుగా ప్రకటించారు కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాట్టా. అందులో భాగంగా కరవు బారిన 25 లక్షల మందికి ఎమర్జెన్సీ రిలీఫ్ క్యాష్ ట్రాన్స్ ఫర్ ప్రోగ్రామ్ ను ప్రభుత్వం ప్రకటించింది.