గంటా రూటు ఎటు?

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు రాజకీయ దారి ఇంకా తేలలేదు. ప్రస్తుతం ఆయనకు తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత లభించడం లేదు

Update: 2022-06-05 04:32 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ దారి ఏదన్నది ఇంకా తేలలేదు. ప్రస్తుతం ఆయనకు తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత లభించడం లేదు. దాదాపు మూడేళ్లు పార్టీని పట్టించుకోక పోవడంతో చంద్రబాబు గంటా శ్రీనివాసరావుపై సీరియస్ గా ఉన్నారు. ఇటీవల ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లినప్పుడు గంటా శ్రీనివాసరావు విశాఖకు ఎయిర్ పోర్టు వచ్చినా ఆయనను చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. దీనికి కారణం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన దూరంగా ఉండటమే కారణమంటున్నారు.

టీడీపీలో ఉన్నారా?
గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ఆయన టీడీపీలో ఉన్నారా? లేదా? అన్నది ఆయనకు కూడా తెలియదు. మొన్నటి వరకూ ఆయన శాసనసభలో కూడా పెద్దగా టీడీపీ చేసే ఆందోళనలకు మద్దతుగా నిలిచేవారు కాదు. అసెంబ్లీ సమావేశాలకు ఇటీవల హాజరుకావడం లేదు. ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేయడంతో శాసనసభకు కూడా రావడం మానేవారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గంటా శ్రీనివాసరావు ఇటీవల కాలంలో కొంత దగ్గరవుతున్నారు. పొత్తులపై జనసేన అధినేత ప్రకటన చేసిన తర్వాత ఆయన తిరిగి యాక్టివ్ అయ్యారు.
బాబుకు పక్కన పెట్టడంతో....
అయితే చంద్రబాబు మాత్రం గంటా శ్రీనివాసరావును నమ్మడం లేదు అనే కన్నా ఇష్టపడటం లేదు. అందుకే ఆయనను దూరంగా ఉంచుతున్నారు. ఇప్పుడు జనసేనలోకి వెళ్లాలా? టీడీపీ లో కొనసాగాలా? అని గంటా శ్రీనివాసరావు మదన పడుతున్నారు. జనసేనకు ఉత్తరాంధ్రలో పెద్దగా నాయకులు లేరు. అయితే పవన్ కల్యాణ్ గంటాను పార్టీలోకి చేర్చుకోవడానికి ఇష్టపడటం లేదని చెబుతున్నారు. తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంలో గంటా శ్రీనివాసరావు కీలక భూమిక పోషించారని అంటున్నారు.
పవన్ సయితం...
అయితే అన్ని రకాలు బలమైన గంటా శ్రీనివాసరావును వదులుకోవడం ఎందుకని కొందరు నేతలు పవన్ కల్యాణ్ కు సూచిస్తున్నట్లు తెలిసింది. గంటా శ్రీనివాసరావు జనసేనలో చేరి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. చిరంజీవితో తనకున్న సంబంధాలను ఆయన ఉపయోగించుకుంటారని చెబుతున్నారు. టీడీపీలో మాత్రం గంటాకు పెద్దగా ప్రాధాన్యత లేదన్నది వాస్తవం. టీడీపీలో ఆయన కూడా కొనసాగడానికి ఇష్టపడటం లేదంటున్నారు. జనసేనలోకి వెళ్లేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News