పొలిటికల్ బాస్... రూట్ మ్యాప్ ఇచ్చారా?
టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి క్లారిటీ వచ్చింది. ఎదగాలంటే టీఆర్ఎస్ నుంచి బయటకు రావడమే బెటరని భావిస్తున్నారు
టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి క్లారిటీ వచ్చింది. తాను రాజకీయంగా ఎదగాలంటే టీఆర్ఎస్ నుంచి బయటకు రావడమే బెటర్ అని ఆయన భావిస్తున్నారు. టీఆర్ఎస్ లో ఇమడలేకపోతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి త్వరలోనే పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఆయన కలవడం కూడా పార్టీ మారడం కోసమే.
రాజకీయంగా....
జగన్ ను పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన రాజకీయ బాస్ గా భావిస్తారు. రాజకీయంగా ఆయనకు జన్మనిచ్చింది జగన్. 2014 ఎన్నికల్లో ఆయనకు ఖమ్మం పార్లమెంటు టిక్కెట్ ఇచ్చారు. అనుకున్నట్లుగానే విజయం సాధించారు. వ్యాపారవేత్తగా సక్సెస్ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయంగా అరంగేట్రంలోనే విజయం సాధించారు. దీంతో ఆయన తనకు రాజకీయ ఎదుగుదలకు తిరుగులేదని భావించారు.
మాట చెల్లుబాటు కాక...
కానీ తెలంగాణ రాజకీయ పరిస్థితులను బట్టి ఆయన 2014లో వైసీపీ నుంచి గెలిచినా తర్వాత అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరారు. అక్కడ తన రాజకీయ భవిష్యత్ కు ఎటువంటి ఆటంకాలు ఎదురుకావని భావించారు. కానీ తర్వాత ఎన్నికల్లోనే ఆయనకు పరాభావం ఎదురయింది. 2018 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టిక్కెట్ లభించలేదు. నామా నాగేశ్వరరావుకు టిక్కట్ ఇచ్చారు. కానీ ఆయన అవమానాన్ని భరించి పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆయన మాట చెల్లుబాటు కాలేదు. దీంతో టీఆర్ఎస్ నుంచి గెలిచిన తాతా మధు పొంగులేటి పై ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. దీనిపై అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
ఏ పార్టీ అనేది....?
పార్టీ అధినాయకత్వం తనపై చర్యలు తీసుకోక ముందే కారు దిగేయాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి భావిస్తున్నారు. అయితే ఆయన బీజేపీలో చేరతారా? లేక కాంగ్రెస్ లో చేరతారా? అన్న దానిపై స్పష్టత రాలేదు. ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థితులను బట్టి ఆయన నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. దీనిపైనే ముఖ్యమంత్రి జగన్ తో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చించారని చెబుతున్నారు. మొత్తం మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారడం ఖాయం. ఎప్పుడు? ఏ పార్టీలోకి అనేది అన్నదే తెలియాల్సి ఉంది.