ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉద్యోగులు షాక్ ఇచ్చారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా శనివారం విజయవాడలో ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాల ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్థసారధి, మల్లాది విష్ణు తదితరులు హాజరయ్యారు. రఘువీరారెడ్డి మాట్లాడుతూ... సీపీఎస్ కి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పోరాడాలని, నిలదీయాలని అన్నారు. కానీ, వారు అసెంబ్లీకి వెళ్లకుండా రోడ్ల మీద తిరుగుతున్నారని విమర్శించారు. దీంతో ఉద్యోగులు సైతం వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి పోరాడాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే హామీ ఇచ్చిన జగన్
దీంతో మైక్ అందుకున్న వైసీపీ నేత పార్ధసారథి మాట్లాడుతుండగా కొంతసేపు ఉద్యోగులు అడ్డుతగిలారు. అయితే, తాము అనేక సమస్యలపై అసెంబ్లీ వేదికగా పోరాడిన ప్రభుత్వానికి దున్నపోతుపై వాన పడ్డట్లు ఉందని విమర్శించారు. అందుకే అసెంబ్లీని బాయ్ కాట్ చేశామని, దీనిపై రాజకీయం చేయవద్దని కోరారు. కాగా, జగన్ పాదయాత్రలోనూ ఉద్యోగులు అనేకసార్లు జగన్ ను కలిసి సీపీఎస్ గురించి చెబుతున్నారు. అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ హామీ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.