రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత
హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు ఆయన కన్నుమూసినట్లు వెల్లడించారు. 1940 జనవరి 20..
టాలీవుడ్ రెబల్ స్టార్, రాజకీయ నేత కృష్ణంరాజు(83) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు ఆయన కన్నుమూసినట్లు వెల్లడించారు. 1940 జనవరి 20వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 1970, 80 దశకాలలో కృష్ణంరాజు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపారు. ఆయన మొత్తం 183 సినిమాల్లో నటించగా.. చాలా వరకూ పవర్ ఫుల్ పాత్రలు వేశారు.
క్షత్రీయ రాజుల వంశస్తులు విజయనగర సామ్రాజ్య వారసులు కృష్ణంరాజు. ప్రముఖ నటుడు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. కృష్ణంరాజు సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు కుమారుడు. కృష్ణంరాజు 1996లో శ్యామలా దేవిని వివాహమాడారు. వారికి ప్రసీదీ, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు. 1991లో కృష్ణంరాజు కాంగ్రెస్ పార్టీలో చేరి.. తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. అదే సంవత్సరం నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసి.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కొద్దికాలం రాజకీయాలకు దూరమై సినిమాలకు పరిమితమయ్యారు.
1998 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి.. విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1999 మధ్యంతర ఎన్నికలలో నర్సాపురం లోక్‌సభ నుండి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొంది కేంద్రంలో వాజపేయి నేతృత్వంలోని ఎన్.డి.ఏ. ప్రభుతంలో మంత్రి పదవిని నిర్వహించారు. 2004 లోక్‌సభ ఎన్నికలలో మళ్ళీ అదే స్థానం నుండి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి జోగయ్య చేతిలో పరాజయం పొందారు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టిని వీడి చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరారు.