సంచయిత వారికి షాక్ ఇవ్వనున్నారా...?
సంచయిత న్యాయ పోరాటం చేస్తున్నారు. కానీ ఆమె పోరాటం ఫలించేటట్లు లేదు. బీజేపీలో ఉన్నా ఆమెకు ఒరిగేదేమీ లేదు.;
చిన్న వయసు. పెద్ద పదవి. రాష్ట్ర రాజకీయాలను ఒక ఊపు ఊపిన యువతి ఆమె. కానీ గత కొన్నాళ్లుగా ఆమె కన్పించకుండా పోయారు. సంచయిత గజపతి రాజు ఇప్పుడు ఏమైపోయారన్నది ప్రశ్నగా ఉంది. దాదాపు ఏడాది పాటు హల్ చల్ చేసిన సంచయిత చివరకు రాజకీయాలకు దూరంగా ఉండటమే మంచిదని నిర్ణయించుకున్నట్లుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూసిన సంచయితకు మైండ్ బ్లాంక్ అయిపోయిందని అనుకుంటున్నారు.
రెండేళ్ల ముందు వరకూ....
సంచయిత గజపతిరాజు రెండేళ్ల ముందు వరకూ ఎవరికీ పెద్దగా తెలియదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. నిత్యం బ్రేకింగ్ న్యూస్ గా మారిన సంచయిత ఇప్పుడు బ్రేక్ తీసుకున్నట్లే కనపడుతుంది. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా, సింహాచలం దేవస్థానం ఛైర్ పర్సన్ గా సంచయిత వ్యవహరించి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. రాజుగారి కూతురా? మజాకా? అంటూ దర్పాన్ని ప్రదర్శించారు.
పదవులు పోవడంతో...
కానీ న్యాయస్థానం తీర్పుతో సంచయిత పదవి ఊడిపోయింది. తిరిగి చిన్నాన్న అశోక్ గజపతి రాజు మాన్సాస్ ట్రస్ట్ ను చేజిక్కించుకున్నారు. సంచయిత తొలుత బీజేపీలో చేరారు. బీజేపీ అయినా అశోక్ గజపతి రాజును దెబ్బకొట్టేందుకు వైసీపీ ప్రభుత్వం సంచయితకు అండగా నిలిచింది. కీలకమైన పదవులను ఆమెకు అప్పగించింది. కానీ అశోక్ గజపతిరాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించి సంచయితను బయటకు పంపారు.
వైసీపీలో చేరతారా?
ఇప్పుడు సంచయిత న్యాయ పోరాటం చేస్తున్నారు. కానీ ఆమె పోరాటం ఫలించేటట్లు లేదు. బీజేపీలో ఉన్నా ఆమెకు ఒరిగేదేమీ లేదు. అందుకే సంచయిత వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. విజయనగరం జిల్లాలో అశోక్ గజపతి రాజును ఎదుర్కొనేందుకు సంచయిత అవసరం వైసీపీకి కూడా ఉంది. సంచయిత కూడా బాబయిపై యుద్ధం చేయడానికి వైసీపీ లో చేరడమే బెటర్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి ఆఫర్ లభించకపోతే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమచారం.