తెలంగాణ ఎన్నికల్లో ఓటింగ్ సరళిపై శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అనుమానాలు వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పోలైన ఓట్లకు, కౌంటింగ్ జరిపిన ఓట్లకు ఎలా తేడా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. రాత్రికి రాత్రే 11 శాతం పోలింగ్ శాతం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై తాము నాలుగేళ్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు మాత్రం టీఆర్ఎస్ నుంచి తమ పార్టీలో చేరిన ఎమ్మెల్సీలపై ఎలా ఫిర్యాదు చేయించారని ప్రశ్నించారు. శాసనమండలి ఛైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని... తమ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన దామోదర్ రెడ్డిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలకు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.