ఆంధ్రప్రదేశ్‌ ‘జీ హుజూర్‌’ అనాల్సిందేనా..!

రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఆంధ్రప్రదేశ్‌ నేతలు ‘జీ హుజూర్‌’ అంటూ తలొంచుకు బతకాల్సిందేనా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటూ అలానే అనిపిస్తోంది. కేంద్రంలో మళ్లీ అధికారం బీజేపీదే అని మెజారిటీ సర్వేలు చెబుతున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌ మరో సారి కేంద్రం ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందేనా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏపీలోని రాజకీయ పార్టీలు తమ ‘ఉనికి’ కోసం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని, ప్రయోజనాల్ని తాకట్టు పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Update: 2023-09-07 04:41 GMT

రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఆంధ్రప్రదేశ్‌ నేతలు ‘జీ హుజూర్‌’ అంటూ తలొంచుకు బతకాల్సిందేనా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటూ అలానే అనిపిస్తోంది. కేంద్రంలో మళ్లీ అధికారం బీజేపీదే అని మెజారిటీ సర్వేలు చెబుతున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌ మరోసారి కేంద్రం ముందు చేతులు కట్టుకుని నిలబడాలా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఏపీలోని రాజకీయ పార్టీలు తమ ‘ఉనికి’ కోసం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని, ప్రయోజనాల్ని తాకట్టు పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

2019 ఎన్నికల్లో ‘ప్రత్యేక హోదా’ అంశాన్ని ప్రధాన ప్రచార అంశంగా మార్చారు చంద్రబాబు. నాలుగేళ్లు అంటకాగిన బీజేపీతో తెగ తెంపులు చేసుకున్నారు. కేంద్రంలో మరోసారి భాజపా అధికారంలోకి రాదనే మీడియా రిపోర్టులను ఆయన బలంగా నమ్మారు. మునిగిపోయే నావమీద ప్రయాణం వల్ల ప్రయోజనం లేదని ఆయన మధ్యలోనే దూకేశారు. ప్రతిపక్షాలను కలుపుకుని కాంగ్రెస్‌తో కొత్త ప్రయాణం ప్రారంభించారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కు మద్దతు పలికి, ఆ పార్టీని కూడా ముంచారు. ఆంధ్రలో కూడా దారుణమైన ఓటమిని చవిచూశారు. భాజపా కేంద్రంలో మరింత మెజార్టీతో అధికారంలోకి రావడంతో... మళ్లీ భాజపాను ప్రసన్నం చేసుకోడానికి పడరాని పాట్లు పడుతున్నారు. దీనివల్ల జాతీయ స్థాయిలో చంద్రబాబు క్రెడిబిలిటీ దారుణంగా దెబ్బతింది. ప్రతిపక్షాలు ఆయన్ను ఓ ప్రాంతీయ పక్ష నేతగా పరిగణించడం మానేశాయి.

గోరుచుట్టు మీద రోకటి పోటులాగా ప్రస్తుతం ఆయన ఆదాయ పన్ను నోటీసులతో ఇబ్బందులు పడుతున్నారు. ‘వివరాలు వెల్లడించని ’ ఆదాయం కేసు ఎప్పటికైనా ఆయనకు ముప్పే. కేంద్రంలో అధికారంలో ఎవరున్నా... వాళ్లను ప్రసన్నం చేసుకోవాల్సిందే.

అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తీరు కూడా ఇలానే ఉంది. జగన్‌ కూడా గత ఎన్నికల్లో ‘ప్రత్యేక హోదా’ అంశాన్ని ప్రచారంలోకి తెచ్చారు. కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని చెప్పారు. బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించడంతో ఆయన కూడా మౌనం దాల్చారు. కేంద్రంతో గొడవలెందుకని, అన్ని అంశాల్లో నరేంద్రమోదీ ప్రభుత్వానికి బేషరతు మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. ‘మాకు రాజకీయాలు అవసరం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరేవీ పట్టవ’ని జగన్‌ నరేంద్రమోదీ ఎదుట స్వయంగా ప్రకటించారు. వైకాపా మద్దతుతోనే కేంద్రం రాజ్యసభలో బిల్లులను నెగ్గించుకుంటోంది అనడం అతిశయోక్తి కాదు. ఇటీవల చట్టరూపం దాల్చిన ‘ఢిల్లీ అధికారాల’ బిల్లుతో సహా కీలక అంశాల్లో వైకాపా భాజపాకు లోక్‌సభలోనూ, రాజ్యసభలోనూ మద్దతు ప్రకటిస్తోంది. రాష్ట్రస్థాయిలో భాజపా నేతల విమర్శలు మినహాయిస్తే, కేంద్రస్థాయిలో మోదీ, జగన్‌ సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ ‘మా రాష్ట్రానికి ఇవి కావాలి’ అని డిమాండ్‌ చేసే పరిస్థితి లేదు.

2024 తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా... రాష్ట్రంలోని రెండు పార్టీలకు భయం తప్పక పోవచ్చు. ఐటీ కేసులో ఇరుక్కున్న చంద్రబాబు, సీబీఐ కేసుల్లో ఉన్న జగన్‌ వల్ల రాష్ట్ర ప్రయోజనాలు పెద్దగా నెరవేరకపోవచ్చు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి, ఆంధ్రప్రదేశ్‌ ఎంపీల మద్దతు అవసరమైతేనే.. మన పార్టీలు కేంద్రాన్ని శాసించే పరిస్థితిలో ఉంటాయి. అక్కడ కూడా రాష్ట్ర ప్రయోజనాల కంటే... వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తే ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు... అధోగతే..!

Tags:    

Similar News