సోము సీన్ మారిపోయిందట.. ఇక అంతా వారిదేనట
గతకొంతకాలంగా సోము వీర్రాజు అధికారాల్లో కోత పడినట్లు తెలుస్తోంది. ఆయన స్వయంగా నిర్ణయాలు తీసుకునే వీలు లేకుండా పోయింది.
భారతీయ జనతా పార్టీలో నిన్నటి వరకూ సోము వీర్రాజు మాట చెల్లుబాటు అయింది. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన నేపథ్యం, బీజేపీతో సుదీర్ఘకాలం అనుబంధం సోము వీర్రాజులో కాన్ఫిడెన్స్ పెరగడానికి కారణం. తాను తప్ప అసలు సిసలైన బీజేపీ నేత ఏపీలో లేరన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. అందులో నిజం లేకపోలేదు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న నేతలందరూ వలసనేతలే. అందుకే సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అపాయింట్ అయిన నాటి నుంచి దూకుడుతో వ్యవహరించారు.
తొలినాళ్లలో...
పార్టీ లైన్ ను థిక్కరించిన వారిపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు. టీడీపీకి అనుకూలంగా మాట్లాడిన వారిని కూడా వదలిపెట్టలేదు. వైసీపీని విమర్శిస్తూ టీడీపీ వైపు సానుకూలంగా ఉన్న వారిని దూరం పెట్టారు. తనకు ప్రత్యేకంగా ఒక వర్గాన్ని రూపొందించుకున్నారు. వీరంతా తొలి నుంచి బీజేపీని అంటిపెట్టుకుని ఉన్నవాళ్లే. వాళ్లతోనే పార్టీని నడిపించాలని సోము వీర్రాజు భావించారు. దీనికి తోడు బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జి సునీల్ దేవధర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావులు అండగా నిలవడంతో సోము వీర్రాజు ఇక తనకు తిరుగులేదనుకున్నారు.
స్వయం నిర్ణయాలు....
కానీ గతకొంతకాలంగా సోము వీర్రాజు అధికారాల్లో కోత పడినట్లు తెలుస్తోంది. ఆయన స్వయంగా నిర్ణయాలు తీసుకునే వీలు లేకుండా పోయింది. ఏపీకి ప్రత్యేకంగా కోర్ కమిటీని కేంద్ర నాయకత్వం నియమించింది. వీరిలో సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్, పురంద్రీశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు ఉన్నారు. వీరంతా ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారే. ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, పార్టీ కార్యక్రమాలు చేయాలన్నా కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.
కోర్ కమిటీదే అంతా....
అందులో భాగంగానే ఈ నెల 28న విజయవాడలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కోర్ కమిటీ నిర్ణయించింది. దీనికి కేంద్ర మంత్రులను ముఖ్యఅతిధులుగా పిలవాలని భావిస్తుంది. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతూ ఈ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఏపీ పోలీసుల ఏకపక్ష వైఖరిపై కూడా నివేదిక ఇవ్వాలని కోర్ కమిటీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజును పక్కన పెట్టి టీడీపీ నుంచి వచ్చిన వారి చేతుల్లోకి బీజేపీ రాష్ట్ర శాఖ వెళ్లిపోయిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. వారు చంద్రబాబుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారని సోము వర్గం వాదిస్తుంది. ఈ పరిణామాలను గమనించిన సోము వీర్రాజు 2024 తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారంటున్నారు. మొత్తం మీద సోముకు ఇక సీన్ లేదని అంటున్నారు.