బాబుకు జగన్ ఝలక్ .. అసెంబ్లీకి రావాల్సిందేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తాను ముఖ్యమంత్రిని అయ్యేంత వరకూ శాసనసభలోకి అడుగుపెట్టబోనంటూ శపథం చేసి వెళ్లారు.

Update: 2021-11-22 10:11 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తాను ముఖ్యమంత్రిని అయ్యేంత వరకూ శాసనసభలోకి అడుగుపెట్టబోనంటూ శపథం చేసి వెళ్లారు. కానీ జగన్ ఇప్పుడు అకస్మాత్తుగా చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టారు. మూడు రాజధానుల అంశాన్ని , సీఆర్డీఏ రద్దు చట్టాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు జగన్ అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. ఇది స్మాల్ బ్రేక్ మాత్రమేనని, మరో రూపంలో మళ్లీ వస్తామని జగన్ చెప్పారు. కొన్ని సవరణలు చేసి బలమైన మార్పులు చేసి మరో బిల్లును మళ్లీ సభ ముందుకు తీసుకు వస్తామని జగన్ చెప్పారు.

మరోసారి బిల్లులు....
మరోసారి రాజధాని వికేంద్రీకరణ బిల్లులను ప్రభుత్వం మరోసారి ప్రవేశపెట్టనుంది. రెండు సభల్లో ఈ బిల్లు త్వరలోనే రానుంది. జగన్ ఇక పెద్దగా ఆలస్యం చేయరు. కేవలం మూడేళ్లు మాత్రమే ఎన్నికలకు సమయం ఉండటంతో న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేలా మరోసారి చట్టాలను చేసేందుకు జగన్ సిద్ధమయ్యారు. అయితే ఇదే సమయంలో తాను సభలో అడుగు పెట్టబోనని చంద్రబాబు శపథం చేసి వెళ్లారు.
రైతుల తరుపున వాదన...
ఈ కొత్త బిల్లులు అసెంబ్లీకి వస్తే ఖచ్చితంగా చంద్రబాబు అసెంబ్లీకి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే తాను నిర్ణయించిన రాజధానిపై చర్చ జరుగుతున్నప్పుడు, రైతులకు అండగా నిలవాల్సి ఉంది. చంద్రబాబు ఎందుకు అమరావతిని రాజధానిగా నిర్ణయించామో మరోసారి సభలో చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి అధికార వికేంద్రీకరణ బిల్లులపై చంద్రబాబు నిలదీయాల్సి ఉంటుంది. కీలక సమయంలో రాజధాని రైతులకు అండగా చంద్రబాబు లేరన్న అపప్రధను ఎదుర్కొనాల్సి ఉంటుంది.
బాబు పునరాలోచనలో....?
అందుకే చంద్రబాబు ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టడంపై పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితిని జగన్ కల్పించారు. రాజధాని అంశం అసెంబ్లీలోకి వస్తున్నా చంద్రబాబు రాకపోతే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. మొత్తం మీద అసెంబ్లీకి చంద్రబాబు రావాల్సిన పరిస్థితిని జగన్ కల్పించారనే అనుకోవాలి. మరి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అసెంబ్లీకి ఈ బిల్లులు ప్రవేశ పెట్టినప్పుడైనా వస్తారా? లేదా? అన్నది ఆసక్తిదాయకమే.


Tags:    

Similar News