పిల్ల చేష్టలు కాక మరేమిటి?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనసేన పార్టీ కార్యాలయంలోకి వెళ్లడం చర్చనీయాంశమైంది
రాజకీయం హుందాగా సాగాలి. నేరుగా పాలిటిక్స్ లోకి వచ్చి ఐదేళ్లు గడుస్తున్నా ఇంకా నేర్చుకోకపోతే ఎలా? ప్రత్యర్థులకు అస్త్రాలు దొరికే పనిచేస్తారా? ఇవీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై సొంత పార్టీ నుంచి విన్పిస్తున్న కామెంట్స్. అసలు రాష్ట్ర రాజకీయాలు లోకేష్ కు అర్థమవుతున్నాయా? అన్న ప్రశ్న కూడా విన్పిస్తుంది. పిల్ల చేష్టలు కాక మరేమిటని ప్రశ్నిస్తున్నారు. లోకేష్ జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
తండ్రి కష్పపడుతుంటే?
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది. చంద్రబాబు పార్టీని పైకి లేపడానికి కిందా మీదా పడుతున్నారు. ఏ చిన్న అవకాశమొచ్చినా చంద్రబాబు తన రాజకీయ చతురతను ఉపయోగించి పార్టీకి ఒక్కొక్క ప్లస్ ను చేర్చుకుంటూ వెళుతున్నారు. చివరకు బోరు మని ఏడ్చి కొంత మార్కులు కొట్టేశారు కూడా. కానీ ఆయన తనయుడు నారా లోకేష్ కు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. తన ధోరణి తనదేనన్న రీతిలో ఉన్నారు.
మూడేళ్ల సమయం ఉన్నా....
ఎన్నిలకకు ఇంకా మూడేళ్లు సమయం ఉంది. ఏపీలో ఇంకా పొత్తులు కుదరలేదు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలసి పోటీ చేస్తుందన్న ప్రచారమయితే జోరుగా సాగుతుంది. కానీ పవన్ కల్యాణ్ ను నమ్మడానికి లేదు. చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చినా ఇస్తారు. బీజేపీ గట్టిగా పట్టుబడితే పవన్ ఎటువైపు మొగ్గు చూపుతారన్నది చివరి వరకూ చెప్పడం కష్టమే. అయితే లోకేష్ అత్యుత్సాహం చూపిస్తున్నారని, జనసేన పార్టీ ఆఫీస్ కు వెళ్లడం క్యాడర్ ను అయోమయంలో పడేసినట్లేనని అంటున్నారు.
ఇప్పటికే ఆందోళనలో నేతలు...
జనసేనతో పొత్తు ఉంటే తమకు సీటు దక్కదన్న ఆందోళన అనేక మంది నేతల్లో వ్యక్తమవుతుంది. వీరు పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఖర్చు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. ప్రధానంగా తూర్పు, పశ్చిమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలో ఈ పరిస్థితి ఉంది. లోకేష్ నిర్వాకంతో వీరిలో మరింత భయం మొదలవుతుంది. అయినా పొత్తుల విషయం చంద్రబాబు చివరలో తేలుస్తారు. ముందుగానే జనసేన పార్టీ కార్యాలయాలకు వెళ్లి లోకేష్ లేనిపోని తలనొప్పులు తెచ్చి పెట్టారంటున్నారు.