దేశం "మీసం" మెలేసింది
మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఎన్నికల ముందు ఈ ఫలితాలు కార్యకర్తలలో ఉత్సాహాన్ని పెంచాయి
అవును.. మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఎన్నికల ముందు ఈ ఫలితాలు కార్యకర్తలలో ఉత్సాహాన్ని పెంచాయి. రోడ్డు మీదకు వచ్చి సంబరాలు చేసుకుంటుండమే ఇందుకు నిదర్శనం. కేవలం మూడు సీట్లు గెలిస్తే సంబరపడిపోవాలా? అని ప్రత్యర్థులు ప్రశ్నించుకోవచ్చు. కానీ విజయం రుచి చూసి ఎన్నాళ్లయింది. నాలుగేళ్ల నుంచి పరాభవాలే. ప్రతికూలతలే. ఎక్కడా అనుకూలత లేకపోవడంతో చంద్రబాబు నాయకత్వంలో సైకిల్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందా? రాదా? అన్న అనుమానాలు కూడా ప్రతి ఒక్కరిలోనూ కలిగాయి.
మూడు చోట్లా...
కానీ రికార్డు బ్రేక్ చేస్తూ మూడు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు మజా చేసుకుంటున్నారు. బాజాల మోత మోగిస్తున్నారు. గత ఎన్నికల్లో కుదేలైన ప్రాంతాల్లో సయితం పార్టీ తిరిగి పుంజుకోవడం ఆశలు చిగురింప చేశాయి. ఇప్పటి వరకూ ఎక్కడో సంశయం. జనసేనతో పొత్తుతో బయటపడదామన్న ఆశ ఉన్నా బలంగా ఉన్న జగన్ ముందు అది సాధ్యమా? అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. కానీ వాటిని ఈ ఎన్నికల ఫలితాలు పటాపంచలు చేశాయనే చెప్పాలి. పసుపు పండగ మొదలయిందంటూ సోషల్ మీడియాలో ఒకటే పోస్టుల జడివాన మొదలయింది.
భయపడిన నేతలు...
చంద్రబాబుపై అనుకూలత లేకపోవచ్చు. ఆయన చేసిన పాలన గుర్తుకు వచ్చి భయపడిన నేతలకు కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఉందన్న సంకేతాలు వెలువడటంతో ఇప్పటి వరకూ వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేసిన స్థానాల్లో ఖర్చు చేసేందుకు కూడా ఆచితూచి వెనుకడుగు వేయాలని భావిస్తున్న నేతలు కూడా ఇక అప్పులు చేసైనా డబ్బులు కుమ్మరించేందుకు సిద్ధమయ్యారంటే అతిశయోక్తికాదు. ఒక సీనియర్ నేత మాట్లాడుతూ తాము ఇన్నాళ్లు భయపడుతున్న మాట వాస్తవమే. ఇప్పుడు పొత్తులు లేకపోయినా ఒంటరిగా పోటీ చేయగలమన్న ధైర్యాన్ని ఈ ఎన్నికలకు మాకు ఇచ్చాయని అనడం అందుకు ఉదాహరణ.
తొడలు కొడుతూ....
ఇక ఎన్నికలు కనుచూపు మేరలో లేవు. ఒకవేళ అనుకోకుండా ఏది వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ తెలుగు తమ్ముళ్లు తొడలు కొడుతున్నారు. ఇక సవాళ్లు పెరగనున్నాయి. చివరకు ఏ స్థాయిలో అంటే పులివెందులలో కూడా తామే గెలుస్తామన్న ధీమాతో నేతలు ప్రకటనలు చేస్తుండటమే ఇందుకు ఉదాహరణ. నియోజకవర్గాల్లో ఇక జోష్ పెరుగుతుంది. నేతల జనం బాట పడతారు. చంద్రబాబు కూడా ఇక వరస జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడతారన్న వార్తలు వస్తున్నాయి. మూడు ప్రాంతాల్లో సైకిల్ బెల్ మారుమోగిపోతుంది. ఇదిచాలదూ అధినేతకు. ఎన్నికలకు ముందు కొండంత బలం. శిఖరమెక్కిన సంతోషం. అందలం ఎక్కిన ఆనందం.