నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టే యత్నం.. కేసీఆర్ సంచలన కామెంట్స్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-11-03 15:00 GMT

తెలంగాణలో జరిగిన ఘటనలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి అందరూ హైకోర్టు న్యాయమూర్తులకు, ముఖ్యమంత్రులకు, మీడియాకు పంపానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ దేశంలో జరుగుతున్న దుర్మార్గం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. ఈరోజు ప్రజాస్వామ్య హత్య గతంలో ఎప్పుడూ చూడలేదని, ఇది ప్రజాస్వామ్య పునాదులకే ప్రమాదమని ఆయన అన్నారు. తాను కూడా షాక్ కు గురయ్యానని ఆయన తెలిపారు. దేశాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిన కేంద్ర ప్రభుత్వం భారత ప్రజాస్వామ్య జీవనాడులను దెబ్బతీసే విధంగా వ్యవహరించిందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఉంది కాబట్టి తాను మీడియా ముందు రాలేదన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ దారుణంగా వ్యవహరించిందన్నారు. పాల్వాయి స్రవంతి తనను కలసినట్లు తప్పుడు వార్తలను సృష్టించారన్నారు. ఇండియా ఆకలి రాజ్యంగా మారబోతుందన్నారు. మునుగోడు పోలింగ్ పూర్తయిన తర్వాత ప్రజలకు తెలియజేద్దామనే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. చాలా బాధతో తాను మాట్లాడుతున్నానని కేసీఆర్ అన్నారు. ఈసీపై కూడా చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.

వ్యవస్థలను దిగజార్చి...
ఎవరినీ లక్ష్యం పెట్టకుండా వ్యవహరిస్తున్నారన్నారు. ఇంత దిగజారడం కరెక్ట్ కాదని ఆయన తెలిపారు. ఏ వ్యవస్థనూ బీజేపీ లెక్క చేయడం లేదన్నారు. ఉద్యమ సమయంలోనూ తాను ఇంత దారుణంగా వ్యవహరించలేదన్నారు. తెలంగాణలో జరిగిన ఈ ఘటనను అందరికీ పంపానన్నారు. చీఫ్ జస్టిస్ నుంచి ప్రతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రులు, ప్రతి మీడియా సంస్థకు పంపానని ఆయన తెలిపారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, తాము రెండు ఉప ఎన్నికల్లో ఓటమి పాలయినా దానిని గౌరవించామని కేసీఆర్ తెలిపారు. రాజకీయాల్లో సంయమనం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. 45 ఏళ్లుగా తాను ఇంత నీచ పరిస్థితిని ఎప్పుడూ చూడలేదన్నారు. బీజేపీ చేస్తున్న అరాచక కాండ జగుప్సాకరంగా ఉందన్నారు. స్వయంగా ప్రధాని బెంగాల్ కు వెళ్లి తమతో టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పారని, ఎప్పుడైనా ఇది విన్నామా? అని ఆయన ప్రశ్నించారు.
నాలుగు రాష్ట్రాల్లో...
గత నెలలో రామచంద్రభారతి వచ్చి అనేక సార్లు ప్రయత్నించారన్నారు. తమ పార్టీకి చెందిన పైలట్ రోహిత్ రెడ్డితో మాట్లాడారన్నారు. తెలంగాణ హైకోర్టుకు కూడా ఫాంహౌస్ విజువల్స్ పంపామని చెప్పారు. దేశంలో అత్యున్నత స్థాయి పేర్లను ఉపయోగించి ఎమ్మెల్యేలను ప్రలోభాలను పెట్టాలని చూశారు. ఇప్పటికే ఎనిమిది ప్రభుత్వాలను కూలగొట్టామని, తర్వాత తెలంగాణ, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ లలో ప్రభుత్వాలను కూల్చివేస్తామని మాట్లాడారన్నారు. అక్కడ వారంతా నిశ్శబ్దంగా ఉన్నారు కాబట్టి బీజేపీ నేతలు జయించారన్నారు. కానీ తెలంగాణ గడ్డ మీద దొరికిపోయారన్నారు. మొత్తం 24 మంది ముఠా ఈ ప్రయత్నాలను ప్రారంభించిందన్నారు. తుషార్ అనే వ్యక్తి కేరళలో వాయనాడ్ లో రాహుల్ గాంధీపై పోటీ చేశారన్నారు. ఒక్కొక్కరి పేరిట నాలుగు పాస్‌పోర్టులు, రెండు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఉన్నాయన్నారు.


Tags:    

Similar News