యాక్షన్ లోకి దిగిన బాబు.. వారికి నో టిక్కెట్స్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే సీనియర్ నేతలను పక్కన పెట్టి యువతను ప్రోత్సహించాలన్న నిర్ణయానికి వచ్చారు. మరో వైపు వరసగా రెండు సార్లు ఓడిపోయిన వారికి కూడా ఈసారి టిక్కెట్ ఇవ్వడం కుదరని పని అని ఆయన చెబుతున్నట్లు తెలుస్తోంది. 2104 ఎన్నికలలో గెలిచి 2019 ఎన్నికల్లో ఓటమి పాలయితే పరవాలేదు. కానీ 2014, 2019 ఎన్నికల్లో వరసగా ఓటమి పాలయిన వారికి ఈసారి టిక్కెట్ దక్కే ఛాన్స్ లేదంటున్నారు.
వరసగా రెండుసార్లు....
ఎందుకంటే 2014లో మోదీ ప్రభంజనంతో పాటు తన ఇమేజ్ కూడా పనిచేసింది. పవన్ కల్యాణ్ కూడా మద్దతిచ్చారు. అప్పుడే దాదాపు అరవై మందికి పైగా టీడీపీ నేతలు గెలవలేదు. ఇక 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ బలంగా వీచింది. 2014లో ఓటమిపాలయినా వారిపై సానుభూతి పెద్దగా దక్కక పోవడాన్ని చంద్రబాబు వారి మైనస్ గా చూస్తున్నారు. 2024 లో జరిగే ఎన్నికల్లోనూ వీరికి సింపతీ వచ్చే అవకాశం లేదని చంద్రబాబు భావిస్తున్నారు.
ఈ నియోజకవర్గాల్లో...
రాజాం, పాలకొండ, విజయనగరం జిల్లాలో కురుపాం, విశాఖ జిల్లాలోని మాడుగుల, అరకు, పాడేరు, తూర్పు గోదావరి జిల్లాలో తుని, పి. గన్నవరం, కొత్త పేట, రంపచోడవరం, కృష్ణా జిల్లాలో నూజివీడు, గుడివాడ, గంటూరు జిల్లాలో బాపట్ల, గుంటూరు ఈస్ట్, మాచర్ల, ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండ పాలెం, సంతనూతల పాడు, కందుకూరు, మార్కాపురం గిద్దలూరు, నెల్లూరు జిల్లాలో కోవూరు, వెంకటగిరి, ఉదయగిరి మినహా అన్ని నియోజకవర్గాలు, కడప జిల్లాలో రాజంపేట మినహా అన్ని నియోజకవర్గాలు, కర్నూలు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాలో కుప్పం, శ్రీకాళహస్తి, చిత్తూరు మినహా మిగిలిన నియోజకవర్గాలున్నాయి.
వీటిపై ప్రత్యేక దృష్టి....
ఇక్కడ రెండుసార్లు వరసగా ఓటమి పాలయిన వారిలో కొందరు ఉన్నారు. 2019 ఎన్నికల్లో కొందరు అభ్యర్థులను మార్చినా వారు కూడా గెలవలేదు. రెండుసార్లు వరసగా ఓడిపోతే అక్కడ కొత్త అభ్యర్థులకు అవకాశమిస్తారట. ఈ నియోజకవర్గాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. రెండు సార్లు వరసగా ఓటమి పాలయితే టిక్కెట్ ఇవ్వరట. అలాగే కేవలం ఆ నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయితే మాత్రం పరిశీలిస్తారట. దీంతో పాటు ఈ మూడేళ్ల నుంచి ఈ నియోజకవర్గాల్లో నేతల పెర్ఫార్మెన్స్ ను కూడా పరిశీలిస్తున్నారు. పనితీరు, ప్రజల్లో వారికున్న ఇమేజ్ ఆధారంగా టిక్కట్ల కేటాయింపునకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.