ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చంద్రబాబు పై ఫైరయ్యారు. చంద్రబాబు ప్రజల సొమ్ముతో దేశ దిమ్మరిగా తిరుగుతున్నారన్నారు. ప్రజాసంక్షేమం కోసం వెచ్చించాల్సిన సొమ్మును తన రాజకీయ స్వప్రయోజనాలకోసం వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఎవరిని కలిసినా తమకు అభ్యంతరంలేదని, అయితే అందుకు ప్రజాసొమ్మును వినియోగిస్తేనే అభ్యంతరమని జీవీఎల్ అన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారనడం సిగ్గుచేటన్నారు. ఆయన మాటల్లో చెప్పేది చేతల్లో చూపించరన్న విషయం ఏపీ ప్రజలకు తెలియంది కాదని జీవీఎల్ ఎద్దేవా చేశారు.
గవర్నర్ అపాయింట్ మెంట్...?
ఇక బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. జీవీఎల్ పనిలేక ఏపీలో ఆంబోతులా తిరుగుతున్నారన్నారు. జీవీఎల్ చేసేవన్నీ అర్థం, పర్థం లేని ఆరోపణలన్నారు. జీవీఎల్ కు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. జీవీఎల్ నరసింహారావుకు, కన్నా లక్ష్మీనారాయణకు గవర్నర్ ఎలా అపాయింట్ మెంట్ ఇస్తారని వెంకన్న ప్రశ్నించారు. చంద్రబాబు మీద ఫిర్యాదు చేసేందుకే వారు గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారన్నారు.