నెల్లూరు కోర్టులో చోరీ.. మంత్రి కాకాణి పై సోమిరెడ్డి పెట్టిన కేసు పత్రాల అపహరణ

2017లో సోమిరెడ్డికి విదేశాల్లో వేలకోట్ల విలువైన ఆస్తులున్నట్లు కాకాణి ఆరోపణలు చేశారు. అందుకు సంబంధించి కొన్ని రుజువులను

Update: 2022-04-15 06:31 GMT

నెల్లూరులోని నాలుగో ఏడీఎం కోర్టులో మొన్న రాత్రి జరిగిన చోరీ తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ కేసు విషయమై సీజ్ చేసిన నాలుగు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. వాటిలో కొన్ని డాక్యుమెంట్లు ఉండగా వాటిని కోర్టు ప్రాంగణంలోనే పడేశారు. పోలీసులు ఆ పత్రాలను స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గతంలో పెట్టిన ఫోర్జరీ కేసుకు సంబంధించిన పత్రాలుగా తేలింది.

2017లో సోమిరెడ్డికి విదేశాల్లో వేలకోట్ల విలువైన ఆస్తులున్నట్లు కాకాణి ఆరోపణలు చేశారు. అందుకు సంబంధించి కొన్ని రుజువులను కూడా బయటపెట్టారు. ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన సోమిరెడ్డి.. నకిలీ పత్రాలను సృష్టించి తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని నెల్లూరు రూరల్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తులో కాకాణి నకిలీ పత్రాలు సృష్టించినట్లు తేలడంతో.. ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో కాకాణిని ఏ-1 నిందితుడిగా, నకిలీ పత్రాల సృష్టికర్త పసుపులేటి చిరంజీవి అలియాస్ మణిమోహన్‌ను ఏ-2గా చేర్చారు.
ప్రస్తుతం ఈ కేసు నెల్లూరు నాలుగవ ఏడీఎం కోర్టులో విచారణలో ఉంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి కోర్టులోకి చొరబడిన దొంగలు ఆ కేసుకు సంబంధించి భద్రపరిచిన డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఈ చోరీ తీవ్ర చర్చనీయాంశమైంది. కోర్టు ప్రాంగణంలో పడేసిన పత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News