వైసీపీలో లెక్కలు మారాయా?

నెల్లూరు పార్లమెంటు స్థానంలో వైసీపీ ఎవరిని పోటీకి దింపుతున్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది;

Update: 2023-05-03 04:50 GMT

పార్లమెంటు ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు ఏపీలో ఒకే సారి జరుగుతాయి. అందుకే అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలపై చర్చ జరగడం మామూలే. అధికార వైసీపీలో ఈ చర్చ కొంత ఎక్కువగా కనపడుతుంది. వినపడుతుంది. ప్రచారం కూడా ఎప్పుడూ ఎక్కువగానే జరుగుతుంటుంది. ఇప్పుడు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఎవరు అన్న దానిపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం నెల్లూరు పార్లమెంటు సభ్యుడిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఇటీవల ఆయనను నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పార్టీ అధినేత నియమించారు.

ఆదాలను హడావిడిగా తెచ్చి...
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ హైకమాండ్‌పై చేసిన వ్యాఖ్యలతో ఆదాలను హడావిడిగా తెచ్చి రూరల్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో కొంత వైసీపీకి రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి ఎవరన్న చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లోనూ రూరల్ నియోజకవర్గం నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని అధికారికంగానే ప్రకటించారు. నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తావన్న జగన్ ఇచ్చిన హామీతోనే ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా అంగీకరించారని చెబుతారు. అంటే వచ్చే ఎన్నికల్లో మరో అభ్యర్థిని పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేయించాల్సి ఉంటుంది. మరి ఆ అభ్యర్థి ఎవరా? అన్న దానిపై జోరుగా చర్చ జరుగుతుంది. కొందరు నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారట.

మాగుంటను పోటీ చేయించాలని...
నెల్లూరు పార్లమెంటు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన బీద మస్తాన్‌రావుకు కూడా రాజ్యసభ పదవి దక్కింది. దీంతో ఆయనను అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశంలేదు. నెల్లూరు పార్లమెంటుకు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారినే అభ్యర్థిగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. అక్కడ మరో సామాజికవర్గానికి ఇచ్చి ప్రయోగం చేసే వీలుండదు. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డిని ఒంగోలు పార్లమెంటు నుంచి నెల్లూరుకు షిఫ్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. మాగుంట కుటుంబానికి సొంత ప్రాంతమైన నెల్లూరు జిల్లాలోనూ పట్టుండటంతో వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు.

వైవీకి మళ్లీ అవకాశం....?
అదే సమయంలో ఒంగోలు పార్లమెంటుకు వైవీ సుబ్బారెడ్డిని పోటీ చేయించాలన్న లెక్కలు కూడా వినపడుతున్నాయి. వైవీ సుబ్బారెడ్డికి గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదు. అధికారంలోకి రాగానే ఆయనను టీటీడీ ఛైర్మన్ గా జగన్ చేశారు. సొంత బాబాయి కావడంతో మరోసారి టీటీడీ ఛైర్మన్ పదవిని జగన్ రెన్యువల్ చేశారు. దీంతో ఈసారి వైవీని ఒంగోలు నుంచి పోటీ చేయించి మాగుంట కుటుంబాన్ని నెల్లూరుకు పంపాలన్న యోచనలో అధినాయకత్వం ఉందని తెలిసింది. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి మాత్రం తన కుమారుడు రాఘవరెడ్డిని ఈసారి ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేయించాలని భావించారు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రాఘవరెడ్డి ఇరుక్కోవడంతో ఆయన మనసు మార్చుకున్నారని చెబుతున్నారు. నెల్లూరులో పోటీకి మాగుంట విముఖత చూపితే మేకపాటి రాజమోహన్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చే అవకాశమూ లేకపోలేదంటున్నారు. అయితే వయసు రీత్యా మేకపాటి పోటీకి సుముఖత చూపకపోతే మాత్రం మాగుంటను నెల్లూరుకు షిఫ్ట్ చేయడం ఖాయమని చెబుతున్నారు.


Tags:    

Similar News