యువగళం @ 100 రోజులు
నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర వందో రోజుకు చేరుకుంది.
నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర వందో రోజుకు చేరుకుంది. ఈరోజు స్పెషల్ గా లోకేష్ తల్లి భువనేశ్వరి పాల్గొననున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేవుల క్యాంప్ సైట్ నుంచి ఈరోజు పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఈరోజు భువనేశ్వరితో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు, లోకేష్ చిన్ననాటి స్నేహితులు కూడా పాదయాత్రలో పాల్గొంటున్నారు.
పండగ వాతావరణంలో....
యువగళం 100వరోజు పాదయాత్రను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు యువగళం టీమ్ కోఆర్డినేటర్ కిలారు రాజేష్ నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. తన భర్త చంద్రబాబునాయుడు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు రాజకీయ వేదికపైకి రాని భువనేశ్వరి తొలిసారి బిడ్డతో కలిసి సోమవారం అడుగులు వేయనున్నారు. నారా, నందమూరి కుటుంబాలు ప్రత్యేక వాహనంలో ఇప్పటికే కర్నూలుకు చేరుకోవడంతో యువగళం బృందాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా...
ఈరోజు లోకేష్ యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నేతలు పాదయాత్రలు చేయాలని కేంద్ర పార్టీ కార్యాలయం పిలుపునిచ్చింది. ప్రతి నియోజకవర్గంలోనూ లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా యాత్రలు నేడు చేస్తున్నారు. దీంతో క్యాడర్‌లో మరింత ఉత్సాహం నెలకొంటుందని పార్టీ అంచనా వేస్తుంది. రాత్రికి లోకేష్ బండి ఆత్మకూరులో బస చేయనున్నారు.