War Zone : యుద్భభూమిలో తెలుగు జర్నలిస్ట్... యుక్రెయిన్ లో సుధాకర్‌రెడ్డి ఉడుముల

యుక్రెయిన్ - రష్యా యుద్ధం కొనసాగుతుంది. మన తెలుగు జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి యుద్ధభూమిలో కవరేజీకి వెళ్లారు

Update: 2024-10-06 06:55 GMT

యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రజలు ప్రాణాలు గుప్పిిట్లో పెట్టుకుని బతుకులు ఈడుస్తుంటారు. బంకర్లలో తలదాచుకుంటారు. కానీ కొందరు జర్నలిస్ట్‌లు మాత్రం అత్యంత సాహసాలను ప్రదర్శించి యుద్ధం దృశ్యాలను తమ కెమెరాలో బంధించే ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే ప్రజల మనోభావాలను తెలుసుకుని దానిని అంతర్జాతీయ సమాజం ముందు ఉంచే ప్రయత్నం చేస్తారు. అది అందరికీ సాధ్యం కాదు. కొందరికే సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రాణాలకు తెగించి యుద్ధం జరిగే సమయంలో, బాంబుల మోతల మధ్య రిపోర్టింగ్ చేయడం అసాధారణమైన విషయం. అతి కొద్ది మంది అంతర్జాతీయ, జాతీయ జర్నలిస్టులు యుద్ధభూమిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు.


పదిహేను రోజులు...

కానీ మన తెలుగు జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి మాత్రం యుక్రెయిన్ - రష్యా మధ్య జరుగుతున్న యుద్ధభూమిలో కవరేజీకి వెళ్లారు. దాదాపు పదిహేను రోజుల పాటు అక్కడే మకాం వేశారు. బాంబుల మోత మోగుతున్నా భయపడకుండా, వెన్ను చూపకుండా యుద్ధం జరుగుతున్న తీరును దగ్గరుండి పరిశీలించారు. అంతేకాదు అనేక సార్లు బాంబుల దాడి నుంచి తప్పించుకుని తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఒక తెలుగు జర్నలిస్ట్ కు ఇది మరుపురాని అనుభూతి. జర్నలిజం చరిత్రలో తాను సాధించాల్సినవి ఎన్నో విజయాలను సాధించిన ఉడుముల సుధాకర్ రెడ్డి ఎవరూ చేయని సాహసం చేయగలిగారు. యుద్దభూమిని, మరుభూమిని తన కెమెరాలో బంధించగలిగారు. ఎందరితోనో మాట్లాడారు. అందరినీ కలసి వారి అభిప్రాయాలను తెలుసుకుని టైమ్స్ ఆఫ్ ఇండియా పాఠకులకు అందించారు.

ఈ సందర్భంగా తెలుగు పోస్టు ఉడుముల సుధాకర్ రెడ్డిని చిన్నపాటి ఇంటర్వ్యూ చేసింది. చేసిన ధైర్యసాహసాలకు మెచ్చుకుంటూ ఒక చిన్నపాటి ఇంటర్వ్యూను మన తెలుగుపోస్టు పాఠకులకు అందించాలన్న ప్రయత్నంలోనే ఈ ఇంటర్వూ సాగింది. అసలు సుధాకర్ రెడ్డి వార్ జోన్ ప్రయాణం ఎలా సాగిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
యుద్ధంపై ఏమన్నారంటే?
"యుక్రెయిన్ - రష్యా యుద్ధం వాస్తవానికి 2014లోనే మొదలయింది. క్రిమి అనే ప్రాంతాన్ని రష్యా ఆక్రమించింది. తర్వాత రష్యా - యుక్రెయిన్ ల మధ్య యుద్ధం 2022లో మాత్రం పూర్తి స్థాయిలో మొదలయింది. 2022 ఫిబ్రవరి లో యుద్ధంమొదలయింది. తాజాగా యుద్ధం తీవ్రమైంది. తూర్పు వైపు యుక్రెయిన్ రాజధాని కీవ్, రష్యా సరిహద్దుల్లో బెలారస్ కూడా ఉంటుంది. మిస్సైల్, డ్రోన్లతో కీవ్, లీవ్ నగరాలకు షెల్లింగ్, క్రాస్ ఫైరింగ్ నడుస్తుంది, మిగిలిన చోట్ల డ్రోన్లతో అటాక్ జరుగుతుంది అయితే సాధారణంగా అందరూ అంతర్జాతీయ జర్నలిస్టులు యుద్ధం జరిగే తీరును కవర్ చేస్తారు. కానీ దీనికి భిన్నంగా నేను అక్కడి ప్రజలు, ఆర్థిక పరిస్థితి, సర్వస్వం కోల్పోయిన పిల్లలు, అనాధలు, కాళ్లు, చేతులు కోల్పోయిన దివ్యాంగుల వంటి వారిపై మానవీయ కోణాల్లో కథనాలను పాఠకులకు అందించగలిను." అని ఉడుముల తెలుగు పోస్టు ప్రతినిధితో చెప్పారు.

ఎలా వెళ్లగలిగారంటే?
"యుక్రెయిన్ చేరుకోవాలంటే పోలండ్ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే యుద్ధం కారణంగా యుక్రెయిన్ గగన తలాన్ని ఆ దేశం మూసివేయడంతో పోలండ్ కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లాల్సి ఉంటుంది. పోలెండ్ బోర్డర్ లో భారీ తనిఖీలుంటాయి. రెండు ఇమ్మిగ్రేషన్లు అవసరం. పోలెండ్ లో దిగి వార్సాలో ఒకరోజు గడిపాను. ల్యాండ్ ఇమ్మిగ్రేషన్ పూర్తి అయిన తర్వాత నేను వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి లీవ్ నగరానికి చేరుకోగలిగాను. తర్వాత యుక్రెయిన్ రాజధాని కీవ్, ఛెర్నీవ్ కు కూడా వెళ్లగలిగాను. అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేశాను. హర్ఖీవ్ లో యుద్దం తీవ్రత ఎక్కువగా ఉంది. తూర్పు ప్రాంతంలో కాల్పులు, కీవ్ లో బాంబుల మోతో నిత్యం దద్దరిల్లిపోతున్నాయి. అయితే అక్కడి ప్రజలు అందరికీ అలవాటు పడిపోయారు. బాంబు షెల్టర్లను సెల్లార్లలో ఏర్పాటు చేసుకుని తమ ప్రాణాలు కాపాడుకోగలుగుతున్నారు" అని సుధాకర్ రెడ్డి తెలిపారు.
బాంబుల మోతల మధ్య...
"యుక్రెయిన్ - రష్యా యుద్దం రెండేళ్ల నుంచి సాగుతుండటంతో అక్కడి ప్రజలు అలవాటుపడిపోయారు. ఇక్కడ ప్రజలు ప్రత్యేకంగా ఒక యాప్ ద్వారా బాంబులు, మిసైల్స్ పడే సమయాన్ని గుర్తించి తలదాచుకుంటున్నారు. ప్రత్యేకమైన యాప్ తమ సమీపంలో బాంబులు, మిస్సైల్స్ పడుతున్న సమయంలోనే హెచ్చరికలు జారీ చేస్తుంది. సైరన్ మోగిన వెంటనే బాంబ్ షెల్టర్లలోకి వెళతారు. రాడార్ వ్యవస్థ ద్వారా సైరన్ మోగే ఏర్పాట్లు చేసుకున్నారు. బయట వాళ్లు బంకర్లలోకి పరుగులు తీస్తుంటే.. అక్కడి ప్రజలు బాంబుల మోతకు అలవాటుపడిపోయి ప్రాణాలు పోయినా సరే.. అన్న ధీమా వారిలో స్పష్టంగా కనిపించింది. నేను కవరేజీలో ఉన్నప్పడే కీవ్ ఆసుపత్రిలో బాంబులు పడ్డాయి. పిల్లలు చనిపోయారు. అలాగే లీవ్ లో బాంబుల దాడికి ఏడుగురు మృత్యువాత పడటం నా కళ్లారా చూశాను. ఛెర్నివ్ లో దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఒకవైపు దాడులతో యుద్దభూమిగా మారి అనేక ప్రాంతాలు ధ్వంసమయినా అంతేవేగంతో పునర్నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. పశ్చిమ దేశాల నుంచి వచ్చే నిధులతో అత్యంత వేగంగా పనులు చేపట్టారు" అని సుధాకర్ రెడ్డి తెలిపారు.
అనేక కథనాలు...
"డ్రోన్లతో యుద్ధం స్వరూపాన్నే మార్చేసింది. రష్యా ఇప్పటికే అనేక ప్రాంతాలను ఆక్రమించుకుంది. కానీ ఆక్రమించుకున్న తమ భూభాగాన్ని కాపాడుకోవడానికి ‍యుక్రెయిన్ సైనికులు వీరోచిత పోరాటం చేస్తున్నారు. యుద్ధం జరుగుతుండటంతో వేలాది మంది యుక్రెయిన్ వదిలి పోలండ్ కు వెళ్లిపోయారు. ఇతర దేశాలకూడా తరలి వెళ్లారు. పోలాండ్ బోర్డర్ లో తలదాచుకుంటున్నారు. నేను మానవీయ కోణంలో అనేక వార్తలు రాయగలిగాను. అలాగే యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలన్ స్కీ అడ్వయిజర్ అలెగ్జాండర్ తో ఇంటర్వ్యూ చేయడంతో పాటు అక్కడ మన భారతీయ సంస్థ సూపర్ హ్యూమన్స్ ప్రతినిధులతో మాట్లాడాను. యుద్ధంలో కాళ్లు, చేతులు కోల్పోయిన ఎందరికో కృత్రిమ అవయవాలను అందించగలిగింది. ఈ సంస్థను థృవ్ అగర్వాల్, ఖాన్ లు నిర్వహిస్తున్నారు. అలాగే యుక్రెయిన్ సైనికులు దాదాపు 70 వేల మంది చనిపోయారు. అనేక గ్రామాలు ధ్వంసమయ్యాయి. యుద్ధం జరిగే సమయంలో రిపోర్టింగ్ అనేది మంచి అనుభవం. నా జర్నలిజం జీవితంలో ఇది మరిచిపోలేను" అని ఉడుముల తెలుగుపోస్టుతో చెప్పారు.
ధైర్యం ఒక్కటే చాలదు...
ఉడుముల సుధాకర్ రెడ్డి ఇప్పటికే 22 దేశాలను పర్యటించారు. మూడు దశాబ్దాల జర్నలిజం జీవితంలో ఇదొక అపురూపమైన అనుభూతి అన్నారు. ఉడుముల సుధాకర్ రెడ్డి. ధైర్యం ఒక్కటే సరిపోదు.. అందుకు సరిపడా వృత్తిపట్ల కమిట్‌మెంట్ అవసరమంటున్నారు. సాధించాలన్న తపన తనను ఇంత దూరం తీసుకువచ్చిందని కూడా ఉడుముల తెలిపారు. తన జీవితంలో యుక్రెయిన్ యుద్ధం కవరేజీ మర్చిపోలేనిదని తెలిపారు. ఇప్పటి వరకూ క్రైమ్, పొలిటికల్, అసెంబ్లీ, హెల్త్, ఎన్నిరాన్‌మెంట్, ఇన్విస్టిగేషన్ ఎడిటర్ గా టైమ్స్ ఆఫ్ఇండియా లో ప్రస్తుతం పనిచేస్తున్నారు. వార్ జర్నలిస్ట్‌లు ఇండియాలోనే అతి తక్కువ మంది ఉన్నారు. అందులోనూ ఒక తెలుగు జర్నలిస్ట్ సాహసంతో చేసిన ఈ ప్రయాణాన్ని తెలుగువారమైన ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే. జర్నలిజం వృత్తిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉడుముల సుధాకర్ రెడ్డి వార్ జోన్ లోకి వెళ్లి మరో మణిహారాన్ని తన మెడలో వేసుకున్నారు. గుడ్ లక్ సుధాకర్ రెడ్డి.


Tags:    

Similar News