ఏపీకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకునే సీబీఐ రావాలి అంటూ టీడీపీ సర్కార్ తీసుకువచ్చిన జీఓ టిష్యూ పేపర్ తో సమానమని, ఇది చెల్లదని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వంపై ఇన్ని ఆరోపణలు వస్తున్న సమయంలో సీబీఐ రాకుండా జీఓ జారీ చేయడం చాలా తప్పిదమన్నారు. సమర్థమైన రాజకీయ నాయకుడైన చంద్రబాబు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరమన్నారు. ఈ దేశంలో ఎటువంటి పార్టీతోనైనా... సిద్ధాంతాలతో సంబంధం లేకుండా... ఏదో ఒక సందర్భంలో... తనకు అవసరం వచ్చినప్పుడు ఎవరితోనైనా కలుస్తానని బాహాటంగా ప్రకటించగలిగే... గిన్నీస్ బుక్కులోకి ఎక్కగలిగే సమర్థ నాయకుడైన చంద్రబాబు నాయుడు సీబీఐ, ఐటీ భయపడటం ఏంటని ఎద్దేవా చేశారు. ఇది కేవలం చంద్రబాబుకే కాకుండా రాష్ట్రం పరువు తీసే జీఓ అని, దీనిని వెంటనే రద్దు చేసుకోవాలని డిమండ్ చేశారు. జడ్జీలపై కూడా ఆరోపణలు వస్తున్నాయని కోర్టులను రద్దు చేస్తారా అని ప్రశ్నించారు.