డెసిషన్ మామూలుగా ఉండదా?

వైసీపీ అధినేత జగన్ రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్‌ఛార్జులతో సమావేశం కానున్నారు

Update: 2023-04-02 06:28 GMT

వైసీపీ అధినేత జగన్ రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో జగన్ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పరిణామాల తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో జగన్ ఎలాంటి నిర్ణయాలను సమావేశాల్లో ప్రకటిస్తారన్నది పార్టీలో చర్చనీయాంశమైంది. ఢిల్లీలో ఉండే జగన్ ఈ సమావేశానికి ఏర్పాట్లు చేయాలని కేంద్ర పార్టీని ఆదేశించడం కూడా సందేహాలకు తావిస్తుంది.

మంత్రివర్గ విస్తరణపై...
ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపై జగన్ ఈ సమావేశంలో చెబుతారని భావిస్తున్నారు. ఏ పరిస్థితుల్లో తాను మూడో విడత విస్తరణకు సిద్ధపడుతుందీ తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో జగన్ ఉన్నారని చెబుతున్నారు. ప్రస్తుతమున్న టీంతో ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేదని గ్రహించిన జగన్ స్వల్ప మార్పులతోనైనా మంత్రివర్గంలోకి సమర్థులైన, బలమైన వాయిస్‌ను వినిపించే వారితో పాటు సామాజికవర్గాల వారీగా లెక్కలు వేసుకుని కొందరిని కేబినెట్‌లోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ విషయాన్నే ఈ సమావేశంలో ఎమ్మెల్యేల ముందు ఉంచుతారని చెబుతున్నారు.
పేరుకు అదే అయినా...
పేరుకు గడప గడపకు ప్రభుత్వం సమీక్ష అంటూ చెబుతున్నా ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై జగన్ ఒకింత సీరియస్‌గానే ఉన్నారని చెబుతున్నారు. క్యాడర్‌ ను నియోజకవర్గాల్లో దూరం చేసుకోవడం, ప్రజల్లోకి ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకెళ్లడంలో కొందరు ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారని కూడా జగన్ అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా క్యాడర్ అసంతృప్తిలో ఉన్నందునే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారన్న నివేదికలను సమావేశంలో ఎమ్మెల్యేల ముందు ఉంచనున్నారని తెలిసింది. పటిష్టమైన క్యాడర్‌ను దూరం చేసుకోకుండా సత్వరమే నష్టనివారణ చర్యలు చేపట్టాలని జగన్ ఎమ్మెల్యేలకు సూచించనున్నారని ముఖ్య నేతలు చెబుతున్నారు.
ఎలాంటి ప్రకటన?
వై నాట్ 175 అంటూ తరచూ చెబుతున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం పార్టీకి కొంత ఇబ్బంది ఏర్పడింది. అది వైసీపీ నేతలు నేరుగా ఒప్పుకోకపోయినా ప్రత్యర్థి పార్టీలకు ప్రాణం పోసి నట్లయింది. ఆ అవకాశం ఇవ్వకూడదనే తరచూ తాను సమావేశాలు పెడుతూ ఉత్సాహపరుస్తున్నానని, కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిర్లక్ష్యం కారణంగానే ఓటమి పాలు కావాల్సి వచ్చిందని జగన్ అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా రాయలసీమలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను కోల్పోవడాన్ని జగన్ జీర్ణించుకోలేక పోతున్నారు. ఇది పూర్తిగా మంత్రులు, ఎమ్మెల్యేల వైఫల్యంగానే అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ నుంచి ఎలాంటి ప్రకటనలు వస్తాయన్నది పార్టీ నేతల్లో గుబులు రేపుతుంది. మరి కొద్ది గంటల్లోనే జగన్ తన మనసులో మాటను బయటపెట్టనున్నారు.


Tags:    

Similar News