జగన్ కు వారున్నారు... నీ కెవరున్నారు?

జగన్ కు నమ్మకైన నేతలున్నారు. కానీ చంద్రబాబుకు ఎవరూ లేరు.

Update: 2021-11-18 07:44 GMT

రాజకీయ పార్టీ అన్నాక నమ్మకమైన నాయకత్వం ఉండాలి. నాయకత్వాన్ని నమ్మితేనే కింది స్థాయి నేతలు కూడా కసితో పనిచేస్తారు. జగన్ కు నమ్మకైన నేతలున్నారు. కానీ చంద్రబాబుకు ఎవరూ లేరు. కసితో పనిచేద్దామన్న తపన ఎవరికీ లేదు. దీనికి చంద్రబాబు స్వయంకృతాపరాధమే కారణం. చంద్రబాబు మనస్తత్వం తెలిసిన వారెవ్వరూ ఆయనను నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబు అవసరానికి వాడుకుంటారు. లేకుంటే వదిలేస్తారు.

బాబును దగ్గరనుంచి....
చంద్రబాబు రాజకీయ అనుభవం నలభై ఏళ్లయితే.. మూడు దశాబ్దాలుగా ఆయనను దగ్గరున్న చూస్తున్న వారు పార్టీలో ఇప్పటికీ అనేక మంది ఉన్నారు. కానీ వారెవ్వరూ కష్టకాలంలో చంద్రబాబుకు ఉపయోగపడరు. దానికి కారణం చంద్రబాబు వైఖరి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎవరినీ పట్టించుకోరు. మంత్రి పదవులు ఇచ్చినా సరే.. వారిని స్వేచ్చగా పనిచేసుకోనివ్వరు. అంతేకాదు తమ నియోజకవర్గాల్లో సొంత సత్తాతో గెలిచి వచ్చిన వారిని సయితం చంద్రబాబు నమ్మరు. వారిని మరింత దూర పెడతారన్న అభిప్రాయం నేతల్లో ఉంది.
జగన్ వెంట...
జగన్ కు ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి ఉన్నారు. కోస్తాంధ్రలో కొడాలి నాని, పేర్ని నాని వంటి వారున్నారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. రాయలసీమ సంగతి ఇక చెప్పాల్సిన పనిలేదు. కానీ టీడీపీకి కసితో పనిచేసే వారెవ్వరు? దుర్భిణీ వేసి చూసినా ఎవరూ కన్పించడం లేదు. ఉన్నోళ్తంతా గతంలో పదవులు అనుభవించిన వాళ్లే. వాళ్లు పైసా తీయరు. పార్టీ కోసం ఖర్చు పెట్టరు. చంద్రబాబుకు బహుమతి ఇవ్వాలన్న ధ్యాసే ఉండదు. అందుకే చంద్రబాబుకు ఇన్ని దారుణమైన ఓటములను వరసగా చూడాల్సి వచ్చింది.
ఇంత హీన స్థాయిలోనా?
టీడీపీకి ఉన్న బలానికి ఇంత హీన స్థాయిలో ఓటమి పాలు కాకూడదు. నెల్లూరులో బలంగా ఉన్నా ఒక్క డివిజన్లో గెలవలేకపోయిందంటే అక్కడి నాయకత్వం పనితీరు ఏ పాటిదో ఇప్పటికే అర్థమయిపోయింది. పెనుకొండలో టీడీపీ అగ్రనేతలందరూ మొహరించినా, పరిటాలకు పట్టున్న ప్రాంతమైనా అక్కడ రెండు డివిజన్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా చంద్రబాబు స్వీయ తప్పిదాలను అంగీకరించాలి. నేతలతో మనసు విప్పి మాట్లాడాలి. లేకుంటే కసితో పనిచేసేవారు ఇక ఉండరు. ఇకపై కనపడబోరు.


Tags:    

Similar News