కోటంరెడ్డికి బిగ్ షాక్
నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వర్గం నుంచి మేయర్ వైదొలిగారు;
నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. శ్రీధర్ రెడ్డి వర్గం నుంచి మేయర్ పక్కకు తప్పుకున్నారు. ఆమె తిరిగి వైసీపీలో చేరేందుకు తాడేపల్లికి చేరుకున్నారు. తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి తాను తిరిగి వైసీపీలో చేరతానని చెప్పడంతో ఆమె రాకతో కోటంరెడ్డి వర్గానికి ఇబ్బంది ఎదురయింది.
మేయర్ కు...
గత కొంతకాలంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డికి, మేయర్ స్రవంతికి మధ్య విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారన్న కారణంతో పార్టీ హైకమాండ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సస్పెండ్ చేసింది. ఆయనతో పాటే మేయర్ స్రవంతి కూడా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
సర్దిచెప్పాలని...
అయితే మేయర్ స్రవంతికి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయి. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి శ్రీధర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆమె తిరిగి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కోటంరెడ్డి వర్గాన్ని వీడి తాను వైసీపీలో చేరతానని ఆమె సజ్జలతో చెప్పినట్లు తెలిసింది. పార్టీ అధినాయకత్వం కూడా సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. మేయర్ నిర్ణయంతో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి.