Chandrababu : ఖజానా ఖాళీ అంటే కుదురుతుందా? ఇచ్చిన హామీలను అమలుపర్చేదెప్పుడు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలను చేపట్టి సుమారు రెండు నెలలవుతుంది.;

Update: 2024-08-09 07:29 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలను చేపట్టి సుమారు రెండు నెలలవుతుంది. అయితే ఆయన పదే పదే ఖజానా ఖాళీగా ఉందని చెబుతుండటంతో ఆయన ఇచ్చిన హామీల మాటేమిటన్న ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. సూపర్ సిక్స్ హామీలు మాత్రమే కాదు.. మ్యానిఫేస్టోలోనూ అనేక అంశాలను జోడించారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా చంద్రబాబు లెక్కకు మించి.. శక్తికి మించి ప్రజలకు హామీ ఇచ్చారంటున్నారు. ఒకటా? రెండా? ఎన్ని వాగ్దానాలు.. ప్రతి సభలో తాను ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలంటే సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా ఇబ్బడి ముబ్బడిగా ప్రామిస్ లు చేశారు.

కొన్ని హామీలను...
తాను అధికారంలోకి వస్తే పింఛను నాలుగు వేల రూపాయలు చేస్తానని చెప్పారు. అంత వరకూ చేయగలిగారు. ఇక అన్నా క్యాంటిన్లు ఆయనకు ఇష్టమైన ప్రాజెక్టు కనుక ఆగస్టు 15వ తేదీ నుంచి దానిని అమలు చేయడానికి రెడీ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందకు పైగా అన్నా క్యాంటిన్లను ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమయింది. అన్నా క్యాంటిన్లలో పది రూపాయలకే భోజనం పెట్టాలని నిర్ణయించారు. ఇది మంచి నిర్ణయమే. దీంతో పాటు మెగా డీఎస్సీని ప్రకటించారు. దాదాపు పదిహేను వేల పోస్టులన భర్తీ చేయడానికి సిద్ధం చేశారు ఇందుకోసం టెట్ పరీక్షను కూడా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.
వీటి సంగతి ఏంటి?
కానీ అసలు విషయం ఏంటంటే? మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్న హామీల ఊసు మాత్రం ఎత్తడం లేదు. ఇక పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలకు 1500 రూపాయలు నెలకు ఇస్తామని ప్రకటించారు. దాని సంగతి కూడా లేదు. ఇక యాభై ఏళ్లు నిండిన బీసీలందరికీ పింఛను మంజూరు చేస్తామన్నారు. దాని ప్రస్తావనే లేదు. రైతు భరోసా నిధులు జమ కాలేదు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులకు శుభవార్త చెప్పానని అనకోవడం మినహా వారికి సకాలంలో రైతు భరోసా అందలేదు. ఇక తల్లికి వందనం కార్యక్రమం కింద నెలకు ఒక్కో విద్యార్థికి పదిహేను వేలు ఇస్తామన్న చంద్రబాబు ఆ హామీని కూడా అటకెక్కించారు. వచ్చే ఏడాది అంతా బాగుంటే దానిని అమలు చేస్తారట.
వైసీపీ ప్రచారం...
ఇలా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఖజానా డొల్ల అంటూ కాలం నెట్టుకొస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖజానా బోసి పోయి ఉంటే ఆ సంగతి ముందు తెలియదా? అని విపక్షాలు నిలదీస్తున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చేంత వరకూ ఒకలా? వచ్చిన తర్వాత మరొకలా వ్యవహరించడం కొత్తేమీ కాదని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీ నేతలు గ్రామ స్థాయిలో జోరుగా ప్రచారం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిధులు సాధించుకుందామనుకుంటే.. మ్యానిఫేస్టో విడుదల సమయంలో బీజేపీ దూరంగా ఉండటం కూడా ఒక ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు? అన్నది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.


Tags:    

Similar News