Rain Alert : వామ్మో .. మళ్లీ వానలే వానలు.. ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరికలు
తాజాగా వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక నేపథ్యంలో మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడనుందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ను వానలు వీడటం లేదు. వరసగా వానాలు చికాకును కలిగిస్తున్నాయి. ప్రజలు భారీ వర్షాలతో నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక నేపథ్యంలో మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడనుందని తెలిపింది. వాయవ్య బంగాళా ఖాతంలో నేడు లేదా రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు ఆంధ్రప్రదేశ్ వాసులను కలవరానికి గురి చేస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు కనిష్టంగా పడిపోయి.. అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఏపీలో మళ్లీ వానలు మొదలవుతాయని చెబుతున్నారు.
ఈ ప్రాంతాల్లో...
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభాశంతో ఆంధ్రప్రదేశ్ లో రాబోయే పది రోజుల పాటు మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలతో పాటు యానాంలలో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే రాయలసీమలోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశముందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రజలు కొంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
వరసగా వర్షాలతో...
ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో వరసగా వర్షాలు పడుతుండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే చిరు వ్యాపారులు చితికి పోతున్నారు. అదేసమయంలో రహదారులన్నీ జలమయం కావడంతో అనేక చోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వర్షం కురవాలని అందరూ కోరుకుంటారు. అప్పుడే పంటలు సమృద్ధిగా పండుతాయి. కానీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఏపీ ప్రజలను చికాకును తెప్పిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలోనూ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అనేక ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.