ఏపీకి సిత్రంగ్ తుపాను ముప్పు తప్పినట్టేనా ?
తుపానుగా మారిన తర్వాత అది పశ్చిమ వాయవ్య దిశగా.. ఒడిశా - పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశాలు ఎక్కువగా
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని.. అది క్రమంగా బలపడుతూ ఈ నెల 23,24 తేదీల నాటికి తుపానుగా మారే అవకాశాలున్నాయని రెండ్రోజులుగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చెప్తోంది. కానీ.. దాని ప్రభావం ఏయే రాష్ట్రాలపై ఉంటుందన్న వివరాలు అప్పుడే ఖచ్చితంగా చెప్పలేమని కూడా తెలిపింది. తాజాగా.. సిత్రంగ్ తుపాను ఏర్పడితే.. దాని ప్రభావం ఏపీ తీర ప్రాంతంపై ఉండబోదని వాతావరణశాఖ అంచనా వేసింది.
తుపానుగా మారిన తర్వాత అది పశ్చిమ వాయవ్య దిశగా.. ఒడిశా - పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ఏపీలో గత రెండు వారాలు వర్షాలు కురుస్తున్నందున ఇక్కడ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయని, అదే సమయంలో పశ్చిమ బెంగాల్ లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో, తుపాను ఆ రాష్ట్రం దిశగా వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
తుపాను దిశ మార్చుకుంటే మాత్రం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవవచ్చని స్పష్టం చేసింది. సిత్రంగ్ తుపాను దిశ మార్చుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపింది. కాగా.. ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది ఐఎండీ.