Ambati : చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు .. పోలవరం పూర్తి కాకపోవడానికి?
పోలవరం ప్రాజెక్టు పై ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలన్నీ అవాస్తవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు
పోలవరం ప్రాజెక్టు పై ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలన్నీ అవాస్తవాలు, పచ్చి అబద్ధాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం పర్యటన సందర్భంగా తాను చేసిన తప్పులను గుర్తు చేసుకోకుండా జగన్ పై బురదజల్లేందుకు చంద్రబాబు ప్రయత్నించారని మండిపడ్డారు. చేసిన తప్పులను ఒప్పుకొని చిత్తశుద్ధితో ప్రాజెక్టును పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. పోలవరానికి సంబంధించిన అంశాలను చాలా దుర్మార్గంగా ఎష్టాబ్లిష్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేశారన్నారు.
నాలుగేళ్లు పడుతుందట...
చివరకు పోలవరం పూర్తిచేయాలంటూ ఇంకా నాలుగు సంవత్సరాలు పడుతుందనే మాట చంద్రబాబు మాట్లాడుతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. 2019కు ముందు చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాలే పోలవరం విషయంలో సంక్షోభం వచ్చిందన్నారు. చంద్రబాబు హయాంలో నాలుగేళ్లు అయినా సరే… ఈ ప్రాజెక్టు పూర్తవుతుందన్న విశ్వాసం కనిపించడంలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు వ్యూహాత్మక తప్పిదాలు, చారిత్రక తప్పిదాలు ఈ పరిస్థితికి దారితీశాయన్నారు. తొలుత స్పిల్‌వే, తర్వాత ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం పూర్తిచేయకుండా డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని చంద్రబాబు చేపట్టడమే దీనికి ప్రధాన కారణమన్నారు. డయాఫ్రం వాల్‌తో పాటు ఎగువ కాఫర్ డ్యామూ, దిగువ కాఫర్ డ్యామూ సమాంతరంగా చేశారని, దీనివెనుక అసలు కారణాలు చంద్రబాబుకు తెలుసునని అంబటి రాంబాబు తెలిపారు.