అందుకే నేను బీజేపీలో చేరా
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు.
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. మాజీ మంత్రి ప్రహ్లాద్ జోషి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 1952 నుంచి తమ కుటుంబానికి కాంగ్రెస్‌తో అనుబంధం ఉందన్నారు. తన తండ్రి అమర్‌నాధ్ రెడ్డి, తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశామని తెలిపారు. కాంగ్రెస్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో అనేక రాష్ట్రాల్లో ఇబ్బంది పడుతుందన్నారు. ప్రజల మద్దతు పొందలేకపోతుందన్నారు. అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పరిస్థితి అలాగే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవినీతిని నియంత్రించే స్థితిలో లేదన్నారు.
కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాలు...
తప్పుడు నిర్ణయాలను తీసుకుంటూ ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోతుందన్నారు. 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోవడానికి ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలేనని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు పవర్ మాత్రమే కావాలని నల్లారి అభిప్రాయపడ్డారు. తాను కాంగ్రెస్‌ను వీడుతానని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. అయినా దేశం అభివృద్ధి కోసం బీజేపీలో చేరాల్సి వచ్చిందని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీజేపీ దేశ వ్యాప్తంగా బలోపేతం కావడం సులువుగా జరగలేదన్నారు. కింది స్థాయి క్యాడర్ నుంచి పెద్ద స్థాయి నేతల వరకూ పడిన కష్టం ఫలితమే బీజేపీకి వరస విజయాలు లభిస్తున్నాయని ఆయన అన్నారు.
కఠిన నిర్ణయాలతో...
2014 నుంచి బీజేపీ విజయాలు కొనసాగుతున్నాయన్నారు. పేదల కోసం ధైర్యంగా నిలబడటం, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే బీజేపీ ఈ స్థాయికి వచ్చిందన్నారు. మోదీ పనితీరు, అంకితభావంతో అవినీతిని అణిచేసేందుకు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. అందుకే తాను బీజేపీలో చేరానని అన్నారు. అరవై సంవత్సరాల కాంగ్రెస్ అనుబంధాన్ని తెంచుకున్నానని అన్నారు. రెండోసారి కాంగ్రెస్‌కు రాజీనామా చేశానని అన్నారు. బీజేపీ ఏడు శాతం 30 శాతానికి పెరిగిందో కాంగ్రెస్ నేతలు ఆలోచించుకోవాలన్నారు. విశ్లేషణ చేసుకునే స్థితి కాంగ్రెస్‌లో లేదని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మోదీ నాయకత్వం దేశానికి అవసరమని అన్నారు. పార్టీ అధినాయకత్వం ఏ పనిచెబితే అది చేస్తానని నల్లారి అన్నారు.