కోస్తా, రాయలసీమకు భారీ వర్షసూచన.. తెలంగాణలో అతిభారీ వర్షాలు
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. నేడు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు..
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్.. దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశాపై సగటు సముద్ర మట్టానికి 1.5 మీటర్ల ఎత్తులో నైరుతి దిశగా పయనిస్తోందని వాతావరణశాఖ తెలిపింది. దాని ప్రభావంతో.. ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. నేడు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే శనివారం ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాయలసీమలో నేడు, రేపు కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహబూబాబాద్, ములుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్ల కింద, పొలాల్లో ఉండరాదని తెలిపింది.