టీడీపీ బాధ్యతలు జూ.ఎన్టీఆర్ కు అప్పగించాలి : కొడాలి నాని
ప్రస్తుతం నారా లోకేష్ "యువగళం" పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం నిర్వహించిన..;
టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించాలని ఏపీ మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నారా లోకేష్ "యువగళం" పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం నిర్వహించిన హలో లోకేష్ కార్యక్రమంలో.. కొందరు అడిగిన ప్రశ్నలకు నారా లోకేష్ జవాబులిచ్చారు. వాటిలోనే.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు టీడీపీ లోకి ఆహ్వానిస్తారా ? అని అడిగిన ప్రశ్నకు లోకేష్ చెప్పిన సమాధానం వివాదాస్పదమయింది.
"రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్లెవరినైనా పార్టీలోకి ఆహ్వానిస్తాం. పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ లాంటివాళ్లు రాజకీయాల్లోకి రావాలి" అని లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులకు కోపం తెప్పించాయి. ఎవరు పెట్టిన పార్టీలోకి ఎవరు ఎవరిని ఆహ్వానిస్తారంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొడాలి నాని సైతం అదే ప్రశ్నను లేవనెత్తారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ ను నారా లోకేష్ ఆహ్వానించడం ఏంటి? అని ప్రశ్నించారు.