అబద్ధాలు చెప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య
రాజమండ్రి వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.;
రాజమండ్రి వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. 2014 ఎన్నికల మేనిఫెస్టో హామీలన్నీ చంద్రబాబు గాలికొదిలేశాడని మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. ఇచ్చిన 650కి పైగా హామీల్లో పది శాతం కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. రాజమండ్రిలో చంద్రబాబు కొత్త పలుకులు, వాగ్ధానాలతో ఊదరగొట్టాడని, ఆయన వాగ్ధాలపై ప్రజలు నవ్వుకుంటున్నారని ధ్వజమెత్తారు. పేదవాళ్ల పట్ల ఇప్పుడు ప్రేమ కురిపిస్తున్న చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో, పద్నాలుగు ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడని అందరికీ తెలుసని విమర్శించారు.
ఏపీలోని ఏ ఒక్క పేదవాడిని కోటీశ్వరుడిని చేసిన దాఖలాలు లేవన్నారు. తల్లికి అన్నం పెట్టనోడు పిన్నతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్న సామెత తరహాలో అధికారంలో ఉన్నప్పుడు పేదవాళ్లకు మంచి చేయనోడు.. రేపు అధికారం ఇస్తేనే మంచి చేస్తానని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు చేసిన మంచి పనుల్లో చెప్పుకోదగ్గ పథకమేదైనా ఉందా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుప్రవేశపెట్టిన పథకాలన్నీ ఆయన దోపిడీ ముఠాలకే లాభం చేకూరేలా అమలు చేశారని ఆరోపించారు. జన్మభూమి కమిటీల పేరుతో ఇష్టానుసారంగా పేదల్ని దోచుకునేందుకు గేట్లు తెరిచి చంద్రబాబు సహా ఆయన తాబేదార్లు కోటాను కోట్లు గడించి బాగుపడ్డారని మంత్రి మేరుగు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు అనేకమంది ప్రభుత్వం తరపున లబ్ధిపొందాలంటే జన్మభూమి కమిటీల పచ్చజెండాల కోసం లంచాలు సైతం సమర్పించుకోవాల్సి వచ్చిందని తీవ్రస్థాయిలో విమర్శించారు.
టీడీపీ మేనిఫెస్టోపై కురసాల కన్నబాబు సైతం తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు వాగ్ధానాలు, అమలు తీరును పరిశీలిస్తే ఆయన రాజకీయాల్లో మాట్లాడిన ఏ ఒక్క మాటను నిలబెట్టుకోలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదవాళ్లు.. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు గుర్తుకువచ్చారా? అని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక, తనను ప్రజలు నిలదీస్తారనే భయంతో తమ పార్టీ వెబ్‌సైట్ నుంచి మేనిఫెస్టోను తొలగించుకున్న నీచమైన చరిత్ర చంద్రబాబుదని కన్నబాబు ఆరోపించారు.
అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. అబద్దాలను నిజాలుగా నమ్మించాలానే బాబు ఆతృత ఆయన కుసంస్కారానికి నిదర్శమని ధ్వజమెత్తారు. అందలం ఎక్కడం.. అధికారం పీఠం చేరుకోగానే అందలం ఎక్కించిన వారిని ఎగిరి తన్నడం చంద్రబాబుకు బాగా అలవాటన్నారు.