వందేళ్లలో ఇదే భారీ వరద
గోదావరికి వందేళ్లలో ఇదే భారీ వరద సంభవించిందని అధికారులు చెబుతున్నారు.;
గోదావరికి వందేళ్లలో ఇదే భారీ వరద సంభవించిందని అధికారులు చెబుతున్నారు. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉప్పొంగుతుంది. జులైలో ఇలాంటి వరదలు వందేళ్లలో ఎప్పుడూ రాలేదని, ఇదే తొలిసారి అని చెబుతున్నారు. పోలవరం 48 గేట్ల ద్వారా 12.69 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో పోలవరం ముంపు మండలాల్లో అనేక గ్రామాలు జగదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. తెలంగాణలోనూ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో గ్రామాలు నీట మునిగాయి. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయితే అనేక గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది.
130 గ్రామాల్లో...
ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 130 గ్రామాల్లోకి వరద నీరు చేరిందని అధికారులు చెబుతున్నారు. సహాయక బృందాలను సిద్దం చేసి ఉంచారు. మరో వైపు కృష్ణా బేసిన్ లోనూ వరద ప్రారంభమయింది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో నేడు జూరాల ప్రాజెక్టు కు వరద నీరు చేరుకుంది. అల్పపీడనం మరింత బలపడటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ప్రమాదకర రీతిలో ఉన్నాయి. ప్రాజెక్టుల కింద ఉన్న గ్రామాల ప్రజలను తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.