Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. చంద్రబాబు కుటుంబంతో శ్రీవారి దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు;

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులలతో కలసి ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలను అందచేశారు. అనంతరం చంద్రబాబు కుటుంబ సభ్యులు తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. తిరుమల అన్నదాన సత్రానికి ఒకరోజు అయ్యే ఖర్చు 44 లక్షల రూపాయలు చంద్రబాబు కుటుంబం టీటీడీకి విరాళంగా ఇచ్చింది.
ఆర్జిత సేవా టిక్కెట్లు...
ఈరోజ జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శన టికెట్స్ విడుదల చేయడంతో వెంటనే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్స్, 11 గంటలకు జేష్ఠాభిషేకం టికెట్స్ ను టీటీడీ అధికారులు విడుదల చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్స్ విడుదల తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆన్ లైన్ విడుదల చేయనున్నారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
పద్దెనిమిది గంటలు...
తిరుమలలోని వైకుంఠం కాంప్లెక్స్ లోని 32 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సర్వదర్శనం 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటలకుపైగానే సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 58,872 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.71 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.