నారా లోకేశ్ పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అడుగడుగునా వైసీపీ కార్యకర్తలు అడ్డుతగులుతున్నారు. ఇటీవల నుంచి కొనసాగిస్తున్న పాదయాత్రలో;

Update: 2023-09-03 12:13 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అడుగడుగునా వైసీపీ కార్యకర్తలు అడ్డుతగులుతున్నారు. ఇటీవల నుంచి కొనసాగిస్తున్న పాదయాత్రలో ఘర్షణలు, రాళ్ల దాడులు ఇలా ఒకటేమిటి చాలా జరుగుతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక చోట లోకేశ్ పాదయాత్రలోకి వచ్చి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో అటు టీడీపీ, ఇటు వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంటోంది. ఇలా ఉద్రిక్తల మధ్య లోకేశ్ పాదయాత్ర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏలూరు జిల్లా భూవనపల్లిలో నారా లోకేశ్ పాదయాత్ర నిర్వహించారు. అయితే లోకేశ్ పాదయాత్ర చేసే సమయంలో క్యాంప్‌ వద్ద వైసీపీ నేతలు లైవ్ వాహనాలకు బైక్‍లు అడ్డం పెట్టినట్లు టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. లోకేశ్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో వైసీపీ నేతలపై యువగళం కార్యకర్తలు దాడి పాల్పడినట్లు తెలుస్తోంది. తమపైనే దాడికి దిగారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. రెండు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకు రాళ్లతో దాడి చేసుకున్నారు.

అయితే వైసీపీ కార్యకర్త పై దాడి చేసిన టీడీపీ కార్యకర్తను అప్పగించాలని క్యాంప్ లోపలికి పోలీసులు వెళ్లగా, అనుమతి లేకుండా క్యాంప్ లోపలికి ఎలా వస్తారని పోలీసులకు ఎదురు తిరిగారు టీడీపీ కార్యకర్తలు. దీంతో చేసేదేమీ లేక పోలీసులు వెనుదిరిగారు. కానీ పోలీసుల తీరు పట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నం చేస్తుంటే పోలీసులు తమపై కేసులు పెడుతున్నారంటే మండిపడుతున్నారు. వైసీపీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. 

Tags:    

Similar News