చెడ్డీ గ్యాంగ్ వేటలో పోలీసులు.. అప్రమత్తమైన ప్రజలు
విజయవాడ, తాడేపల్లి ప్రాంతాల్లో సోమవారం జరిగిన దోపీడీల యత్నాలతో కృష్ణ - గుంటూరు జిల్లాల వాసులు భయాందోళనలకు గురవుతున్నారు
విజయవాడ, తాడేపల్లి ప్రాంతాల్లో సోమవారం జరిగిన దోపీడీల యత్నాలతో కృష్ణ - గుంటూరు జిల్లాల వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రెయిన్ బో విల్లాస్ లో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో ఓ ముఠా దోపీడీకి యత్నించింది. ఇది చెడ్డీ గ్యాంగ్ పనేనని పోలీస్ యంత్రాంగం భావిస్తోంది. ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల ముఠా కోసం ఐదు ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజీల ఆధారంగా.. పాత నేరస్తుల ఫొటోలను పరిశీలిస్తున్నారు.
ఎమ్మెల్యే ఇంటిలోనే...
రెయిన్ బో విల్లాస్ లో దొంగతనం యత్నం అనంతరం.. అపార్ట్ మెంట్ వాసులందరినీ తాడేపల్లి పోలీసులు అప్రమత్తం చేశారు. ప్రతి ఇంటిలో సీసీ కెమెరాలను పెట్టుకోవాలని సూచించారు. అలాగే ఎవరిపైనైనా అనుమానం వస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. తాడేపల్లి ఘటన తో పాటు విజయవాడలో మరో రెండు చోట్ల చోరీలు జరగడంతో.. ఇది చెడ్డీ గ్యాంగ్ పనై ఉంటుందా ? లేక స్థానిక నేరస్తులే చెడ్డీ గ్యాంగ్ వేషంలో వచ్చి దోపిడీ చేసి ఉంటారా ? అన్న కోణంలో పోలీసు బృందాలు విచారణ చేస్తున్నాయి.