ఫ్యాక్ట్ చెకింగ్: రైలు హారన్ కారణంగా ముస్లింల నమాజ్ కు ఆటంకం కలగడంతో యువకులు రైలుపై దాడి చేశారా..?
వీడియోలో కొందరు యువకులు రైలుపై రాళ్లు రువ్వుతున్న వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో, రైలు మొదట కదలకుండా కనిపించింది.
క్లెయిమ్: రైలు హారన్ కారణంగా నమాజ్ కు ఆటంకం కలగడంతో యువకులు రైలుపై దాడి చేశారు
ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు
ఇటీవలి కాలంలో కొన్ని ప్రాంతాల్లో పండుగల సమయాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే..! ముఖ్యంగా హిందూ పండగల సమయంలో కొన్ని చోట్ల రాళ్ల దాడులు.. ఇరు వర్గాల మధ్య భౌతిక దాడులు చోటు చేసుకున్నాయి. రామ నవమి, హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా పలు రాష్ట్రాల్లో హింస చెలరేగింది. రాళ్లదాడులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. కొన్నింటికి ఇటీవల జరిగిన మతపరమైన హింసతో ఎలాంటి సంబంధం లేదు. అయినా కూడా పలువురు వాటికి మతం కోణంలో కలరింగ్ ఇస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కొందరు యువకులు రైలుపై రాళ్లు రువ్వుతున్న వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో, రైలు మొదట కదలకుండా కనిపించింది. యువకుల రాళ్ల దాడి ఎక్కువవ్వడంతో రైలు కదలడం మొదలైంది. రైలు ముందుకు కదులుతున్నా కూడా ఆ యువకుల బృందం మరింత వేగంగా రాళ్లు రువ్వుతూనే ఉంది. తమ ప్రార్థనలకు రైలు హారన్ అంతరాయం కలిగించడంతో ముస్లింల బృందం రైలుపై రాళ్లు రువ్వడం ప్రారంభించిందన్న వాదనతో ఫేస్‌బుక్, ట్విట్టర్ వినియోగదారులు 28 సెకన్ల నిడివి గల వీడియోను . షేర్ చేశారు
నిజ నిర్ధారణ:
మా బృందం వైరల్ పోస్టుల ద్వారా జరుగుతున్న ప్రచారం అబద్ధం అని గుర్తించింది. వైరల్ పోస్టులు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం చెన్నైలో జరిగిన రాళ్ల దాడికి సంబంధించిన వైరల్ వీడియో ఇది. కళాశాల విద్యార్థులైన రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో భాగంగా రికార్డు చేసిన వీడియో ఇది.వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ లో సెర్చ్ చేయగా.. ఎక్కువ నిడివి కలిగిన సత్యం న్యూస్ యూట్యూబ్ వీడియోకు చెందిన లింక్ మాకు కనిపించింది.
వైరల్ వీడియోను మీడియా సంస్థలు అప్లోడ్ చేసిన వీడియోలను పరిశీలించగా.. రెండూ ఒకటేనని మేము ధృవీకరించాము. వీడియో వివరణలో కానీ శీర్షికలో కానీ నమాజ్ ప్రస్తావన కనిపించలేదు. చెన్నైలోని పెరంబూర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన "కాలేజీ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ" అని తెలుపుతూ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.
మేము సంబంధిత పదాలతో కీవర్డ్స్ సెర్చ్ ను నిర్వహించాము. ETV భారత్, ఇండియా టుడే నుండి పలు వార్తా నివేదికలను చూశాము. ఏప్రిల్ 11న చెన్నైలోని పెరంబూర్ స్టేషన్ సమీపంలో ఘర్షణ జరిగినట్లు ఈ మీడియా సంస్థల నివేదికలు పేర్కొన్నాయి.
నివేదికల ప్రకారం.. ప్రెసిడెన్సీ కళాశాల విద్యార్థులు తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో, పచ్చయ్యప్ప కళాశాల విద్యార్థులు అరక్కోణం వెళ్లే రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రెసిడెన్సీ కాలేజీకి చెందిన విద్యార్థులు రైలులో కాస్త అతిగా ప్రవర్తించారు. దీంతో ప్రయాణికులు ఫిర్యాదు చేసి రైలును ఆపాలని ఒత్తిడి చేశారు. విద్యార్థులు కిందకు దిగి పచ్చయ్యప్ప కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అరక్కోణం వైపు వెళ్తున్న రైలుపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో రైలు డ్రైవర్ రైలును ఆపినట్లు సమాచారం. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ కాలేజీల విద్యార్థుల మధ్య గొడవలు గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో పలు మార్లు ఈ కాలేజీల విద్యార్థులు కొట్టుకున్న ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలు మీడియా సంస్థలు కూడా కథనాలను ప్రసారం చేశాయి. ఈ వైరల్ వీడియో కూడా అంతే.. ఈ గొడవలకు ఎటువంటి మతపరమైన కోణం కనుగొనలేదు. రెండు వేర్వేరు కళాశాలల విద్యార్థుల మధ్య ఘర్షణల వీడియోలను తప్పుగా మతపరమైన కోణంతో ప్రసారం చేశారని మేము నిర్ధారించాము.
కాబట్టి.. వైరల్ పోస్టులలో ఎటువంటి నిజం లేదు.
క్లెయిమ్: నమాజ్ కు ఆటంకం కలగడంతో యువకులు రైలుపై దాడి చేశారా..?
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim : Muslims started pelting stones at a train after its horn interrupted their prayers.
Claimed By : Social Media Users
Fact Check : False